Khamenei funeral: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చివరి నివాళులు అర్పించేందుకు అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 4 నుంచి 9 వరకు టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే కార్యక్రమాలు ఖోమ్‌లో మతపరమైన నివాళులతో కొనసాగి, మష్హద్‌లోని పవిత్ర స్థలంలో ఖననంతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్ బహిరంగ ప్రత్యక్షతపై ఆసక్తి నెలకొంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత అత్యున్నత మతపరమైన పదవిని చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ఒక్క బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. దేశ ప్రజలను ఉద్దేశించి ఏ వీడియో సందేశం లేదా ఆడియో ప్రసంగం కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన నాయకత్వ సామర్థ్యం, అధికార నిర్వహణపై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆరోగ్యం, గాయాలపై ఊహాగానాలు
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీకి ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో ఆరోగ్య పరిస్థితి గురించి అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. జూలై 4న టెహ్రాన్‌లో ప్రారంభమయ్యే అంత్యక్రియల్లో ఆయన హాజరవుతారా అనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది.
ప్రపంచ నాయకుల హాజరు..
ఖమేనీ అంత్యక్రియలకు రష్యా, చైనా, టర్కీ, ఖతర్, ఇరాక్, లెబనాన్ వంటి దేశాల అధినేతలు లేదా ప్రతినిధులు హాజరు కావచ్చని సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంగా ఈ వేడుకలు అత్యంత సున్నితమైనవిగా మారాయి.
అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తన భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది. కీలక భవనాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాల వద్ద అప్రమత్తత పెంచింది. ఈ నాయకత్వ మార్పులు మధ్యప్రాచ్య రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
