Ayatollah Khamenei Funeral: అమెరికా–ఇరాన్ యుద్ధం దాదాపు ముగిసింది. జనీవాలో తుది ఒప్పందం కుదిరింది. దీంతో ఇక ఇరాన్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంకుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతుండడం, ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ కూడా గాయపడడంతో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించలేదు. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదరడంతో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ నిర్ణయించింది. ఈమేరకు అంత్యక్రియలకు ప్రపంచంలోని వివిధ దేశాల నేతలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తరఫున ఆహ్మానాలు పంపారు. ఈమేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. జూలైలో జరగనున్న అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు రావాలని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ఆహ్వానాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందజేసింది.
ఖమేనీ మరణం నేపథ్యం
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు జూలై 9న మషాద్‌లో జరగనున్నాయి. కార్యక్రమాలు జూలై 4 నుంచి టెహ్రాన్‌లో మొదలై, జూలై 9న ఖననంతో ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్, పాకిస్తాన్ తదితర దేశాల అధినేతలను కూడా ఆహ్వానించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక ప్రతినిధి బృందం హాజరవుతుందని తెలియజేశారు.
మోదీ హాజరవుతారా?
భారత్ తరఫున ఎవరు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం కాలేదు. మార్చి 5న ఖమేనీ మరణానికి భారత్ అధికారికంగా సంతాపం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారు.
మోదీ–ఇరాన్ సంబంధాలు
ప్రధాని మోదీ చివరిసారిగా 2016 మేలో ఇరాన్‌ను అధికారికంగా సందర్శించారు. ఆ సమయంలో చాబహార్ పోర్టు# అభివృద్ధి కోసం త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశారు. 2018లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారత్‌ను సందర్శించారు. అక్టోబర్ 2024లో బ్రిక్స్ సదస్సులో మోదీ, పెజెష్కియాన్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మోదీ పెజెష్కియాన్‌ను భారత్‌కు ఆహ్వానించారు.
ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు సత్సంబంధాలే ఉన్నాయి. ఈ సంబంధాల కారణంగానే యుద్ధ సమయంలో ఇరాన్ హర్మూజ్ గుండా ఇరాన్ చమురు నౌకలు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఖమేనీ అంత్యక్రియలకు మోదీ హాజరు అనుమానమే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెల్లకపోవడమే మేలని కూడా సూచిస్తున్నారు.
