Israel vs Hezbollah : అసలే ఇజ్రాయిల్.. ఆపై మంట మీద ఉంది.. అలాంటి దేశాన్ని గెలికితే ఇలానే ఉంటుంది..

కోపం మీద ఉన్నవాడిని గెలికితే మరింత కోపాన్ని ప్రదర్శిస్తాడు. కసి మీద ఉన్న వాడిని రెచ్చగొడితే మరింత రెచ్చిపోతాడు. ఇజ్రాయిల్ దేశంపై ఇలాంటి చర్యలకు పాల్పడి హెజ్ బొల్లా ఫలితాన్ని అనుభవించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 18, 2024 6:52 pm

Israel, Hezbollah

Follow us on

Israel vs Hezbollah : సాధారణంగా ఇజ్రాయిల్ పేరు మదిలో మెదిలితే అత్యాధునిక సాంకేతికత కళ్ళ ముందు కనిపిస్తుంది. సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం అనే వ్యవసాయ పద్ధతులను ప్రపంచానికి పరిచయం చేసింది ఇజ్రాయిల్. పెగాసస్ లాంటి స్పైవేర్ ను కనిపెట్టి సంచలనానికి నాంది పలికింది. క్షిపణులు, అత్యాధునిక లాంచర్లు, డ్రోన్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇజ్రాయిల్ ప్రయోగాలకు ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. నెత్తురు చిందించకుండా.. బాంబు పేల్చకుండా.. శత్రువులను చంపడం ఇజ్రాయిల్ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. చుట్టూ శత్రు దేశాలు ఉన్నప్పటికీ.. తనను తాను కాపాడుకుంటున్నదంటే దానికి ప్రధాన కారణం ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ. అలాంటి దేశంపై కొంతకాలంగా హెజ్ బొల్లా అనే మిలిటెంట్ సంస్థ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇజ్రాయిల్ దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతోంది. పంటి కింద రాయి లాగా.. చెవులో జోరిగ లాగా ఇబ్బంది పెడుతున్న హెజ్ బొల్లా సంస్థను ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. ఇంకేముంది అంచనాలకు అందని స్థాయిలో మట్టుపెట్టే ప్రణాళిక విజయవంతంగా రూపొందించింది.

జేమ్స్ బాండ్ తరహాలో

హాలీవుడ్ సినిమాలో జేమ్స్ బాండ్ ఆపరేషన్లు అత్యంత రహస్యంగా జరుగుతుంటాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే చేయాల్సిన నష్టం చేసేసి వెళ్తుంటాయి. అలాంటి ఆపరేషన్లు చేయడం ఇజ్రాయిల్ దేశానికి కొట్టినపిండి. ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో చెందిన డిఫెన్స్ మాజీ అధిపతిని హత్య చేయడానికి హెజ్ బొల్లా కుట్రలు పన్నింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ (షిన్ బెట్) పసిగట్టింది. కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే లెబనాన్ ప్రాంతంలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయిల్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో జేమ్స్ బాండ్ తరహా దాడులకు పాల్పడి ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది.

1996లో హమాస్ చీఫ్ బాంబు మేకర్ యాహ్యా అయ్యాష్ ను చంపేసింది. సెల్ ఫోన్ బాంబుతో అతడిని మట్టు పెట్టింది.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ లో ఓ విడిది గృహంలో ఉన్నాడు. అక్కడ బాంబు పేల్చి అతనిని చంపేసింది. అతడిని చంపడానికి ఆ గదిలో బాంబు అమర్చింది. ఈ పని కొద్ది నెలల ముందు చేసింది. దీనికోసం ఐ ఆర్ జీ సీ సభ్యులను వాడుకుంది.

ఇరాన్ దేశానికి చెందిన న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహాసన్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే మిషన్ గన్ తో కాల్చి చంపింది. ఈ ఆపరేషన్ కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించింది.

ఇరాన్ అణు కేంద్రంలో యురేనియం శుద్ధి చేసే 1000 సెంట్రిఫ్యూజ్ లను ఇజ్రాయిల్ దెబ్బతీసింది. దీనికి స్టక్స్ నెట్ అనే మాల్ వేర్ ఉపయోగించింది. దీంతో ఇరాన్ దేశానికి వందల కోట్లు నష్టం వాటిల్లింది.

ఒకప్పటి హమాస్ చీఫ్ ఖలీద్ మషాల్ ను హత్య చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించింది. అతడికి విషపూరితమైన ఇంజక్షన్ ఇచ్చింది. శాంతి ఒప్పందం నుంచి వైదొలుగుతామని మిత్ర దేశం జోర్డాన్ హెచ్చరించడంతో ఇజ్రాయిల్ ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ తర్వాత అతడికి యాంటి డోస్ అందేలా చేసింది. దీంతో ఖలీద్ బతికి బయటపడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇజ్రాయిల్ చేసిన ఆపరేషన్లకు ఫుల్ స్టాప్ ఉండదు.