Houthis: ఎర్ర సముద్రం.. ప్రపంచ నౌకా రవాణా రంగంలో అత్యంత కీలక మార్గం. ఈజిప్టులోని సూయెజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యదరాసముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ సరకు రవాణా నౌకలపై దాడులకు దిగుతున్నాయి.
ఆ మూడు మార్గాలే కీలకం..
నౌకా రవాణా రంగంలో హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి మలక్కా, హోర్ముజ్, బాబ్ ఎల్–మండెప్ జల సంధులు అత్యంత కీలకమైనవి. ప్రపంచంలోని 40 శాతం చమురు ఈ 3 జలసంధుల మీదుగానే వెళ్తుంది. ఈ మార్గాలకు అడ్డంకులు సృష్టించడం ఆందోళనకరమే. హౌతీ దాడులతో బెంబేలెత్తిపోయిన షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. బాబ్ ఎల్–మండెప్ మార్గంలో నౌకలను తిప్పబోమని ప్రకటించాయి. ఇది 10 శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్క్స్, ఎంఎస్సీ, హపాగ్ లాయిడ్ కంపెనీలు రవాణాను నిలిపేశాయి. బీపీ చమురు కంపెనీ రవాణాను ఆపేసింది.
అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం?
ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం నౌకల ద్వారానే జరుగుతోంది. భారత్‌కు అది 95 శాతం. వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16 శాతం. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌక కావడంతో అధిక రవాణా దీని ద్వారానే జరుగుతోంది. దుస్తుల నుంచి కార్లు, చమురు, గ్యాస్‌కు నౌకలే ఆధారం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైయినర్ ధర 5 శాతం పెరిగింది. ఏడాదికి 19 వేల నౌకలు సూయెజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతోపాటు సమయం వృథా అవుతుంది. ప్రస్తుతం హౌతీ దాడులతో బీమా కంపెనీలు ప్రీమియంను పెంచాయి. ఈ భారం అంతిమంగా ప్రజలపైనే పడుతుంది.
భారత్‌పై ప్రభావం..
ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత్ నౌకల ద్వారా సరకు రవాణా చేస్తోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే అధికంగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12 శాతం భారతీయులే ఉంటారు. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబల్స్ ప్రమాదకరంగా మారారు.
ఎవరీ హౌతీలు?
జైదీ షియాలు, హౌతీ తెగకు చెందిన వారి హక్కు పరిరక్షణ పేరుతో 1990లో హౌతీ గ్రూపు ఏర్పాటైంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంది. పశ్చిమ యెమెన్ ఈ గ్రూపునకు కేంద్రం. ఇరాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్‌కు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్–మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్– మండెప్పై హౌతీ రెబల్స్‌కు ఆధిపత్యం ఉంది. 2014 నుంచి యెమెన్‌లోని సైనిక ప్రభుత్వంతో ఈ గ్రూపు పోరాడుతూనే ఉంది. ఈ పోరాటంలో ఇప్పటిదాకా 3,77,000 మంది మరణించారు. 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
2015 నుంచి హౌతీకి ఆయుధ సంపత్తి
చుట్టూ కొండలతో రక్షణ కలిగిన యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌కు ఇరాన్ ప్రభుత్వం 2015 నుంచి భారీగా ఆయుధాలు సమకూరుస్తోంది. డబ్బులు అందిస్తోంది. ఆయుధాల్లో డ్రోన్లు, యాంటీ షిప్, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వందల కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపైనా దాడులు చేయగల ఆయుధాలు రెబల్స్‌కు అందుతున్నాయి.
సుదీర్ఘకాలం ఆగితే…
ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే సరకు రవాణాలో ఐదో వంతు చమురే. రెండు వైపులా రోజుకు 9 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరగడం ఖాయం.