Doomsday Plane US: ఇటీవల ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేసింది. బలమైన ఐరన్ డోమ్ వ్యవస్థను ఢీ కొట్టింది. ఆ తర్వాత హమాస్ ఉగ్రవాదులపై పై ఇజ్రాయిల్ దాడులు చేసింది.. కొంతకాలానికి ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఈ క్షిపణులు అత్యంత శక్తివంతమైనవి. అంతకు ముందు జరిగిన యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ పై బలమైన ఆయుధాలను వాడింది. శక్తివంతమైన బాంబులను వినియోగించింది. స్థూలంగా చెప్పాలంటే దేశాల మధ్య ఏర్పడుతున్న వివాదాలు అంతిమంగా యుద్దాలకు దారితీస్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాలనే పరిగణనలోకి తీసుకుంటే.. అప్పట్లో అణు యుద్ధం జరుగుతుందనే వ్యాఖ్యలు వినిపించినప్పటికీ.. తర్వాత రష్యా ఎందుకో వెనుకడుగు వేసింది. ఇప్పటికైతే ప్రపంచ దేశాలు న్యూక్లియర్ వార్ పై దృష్టి సారించకపోవచ్చు గాని.. భవిష్యత్తు కాలంలో పాకిస్తాన్ లేదా ఉత్తరకొరియా అటువంటి యుద్ధాలకు పాల్పడితే ఏం చేయాలి? అటువంటి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్నలకు అమెరికా తన చేతుల ద్వారా సమాధానం చెబుతోంది.
ఆర్మీ పరంగా, ఆయుధాల పరంగా, అణ్వస్త్రాల పరంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాకు పేరు ఉంది. అమెరికా గిచ్చి కయ్యం పెట్టుకునే రకం కాబట్టి.. శత్రువులు చాలా ఎక్కువ. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బాంబు దాడి జరిగిన తర్వాత అమెరికా తన బలగాలను మరింత పెంచుకుంది. తన రక్షణ రంగానికి కేటాయింపులను విపరీతంగా పెంచింది. కొత్త కొత్త ఆయుధాలను కనిపెడుతోంది. యుద్ధ విమానాలను ఆవిష్కరిస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. భవిష్యత్తు కాలంలో అణు యుద్దాల వంటివి జరిగితే తట్టుకునే విధంగా విమానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే వాటి తయారీలో నిమగ్నమైంది. E48 పేరుతో అమెరికా ఇప్పటివరకు యుద్ధ విమానాలను వాడేది. వాటి స్థానంలో ప్రత్యేకమైన విమానాన్ని తయారు చేసేందుకు అమెరికా వైమానిక దళం అడుగులు వేస్తోంది. దీనికోసం “సియేర్రా నెవాడా కార్పొరేషన్” కు భారీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లట. ఈ విమానానికి “డూమ్స్ డే ప్లేన్” అని నామకరణం చేసింది. ఇప్పటికే అమెరికా వద్ద 4 డూమ్స్ డే విమానాలు ఉన్నాయి. ఈ విమానం ఒకవేళ అణు యుద్ధం వంటిది జరిగితే అమెరికా అధ్యక్షుడిని అత్యంత సురక్షితంగా తరలిస్తుందట.
సియేర్రా నెవాడా కార్పొరేషన్ గతంలో అమెరికాకు అనేక యుద్ధ విమానాలు తయారు చేసింది. ప్రస్తుతం తయారు చేస్తున్న డూమ్స్ డే యుద్ధ విమానం అనేక సౌకర్యాలు కలిగి ఉంది. అణు యుద్ధాన్ని కూడా తట్టుకుంటుంది. సర్వైనబుల్ ఎయిర్ బోర్న్ ఆపరేషన్ సెంటర్ పేరుతో సియేర్రా నెవాడా కార్పొరేషన్ డూమ్స్ డే యుద్ధ విమానాన్ని రూపొందిస్తున్నది. ఇది 2036 నాటికి పూర్తవుతుంది. భవిష్యత్తులో ఏవైనా న్యూక్లియర్ వార్స్ జరిగితే.. ఈ విమానంలో అమెరికా అధ్యక్షుడు సురక్షితంగా ఉంటాడు. అతనితోపాటు వైమానిక దళ కమాండ్ కంట్రోల్ సిస్టం కూడా ఉంటుంది. ఆ విమానంలో ఉండి అమెరికా అధ్యక్షుడు తదుపరి చర్యలను పర్యవేక్షిస్తాడు. వైమానిక దళ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాడు.