Homeఅంతర్జాతీయంAjay Banga: చరిత్రలో తొలిసారి : మన ఇండో అమెరికన్ సాధించేశాడు.. ఏకంగా ప్రపంచ బ్యాంక్‌...

Ajay Banga: చరిత్రలో తొలిసారి : మన ఇండో అమెరికన్ సాధించేశాడు.. ఏకంగా ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడయ్యాడు!

Ajay Banga: మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలను ప్రస్తుతం భారతీయులే నడిపిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్‌కు కొత్త బాస్‌గా భారతీయ సంతతి వ్యక్తి నియమితులయ్యారు. ఇలా భారతీయుల ఖ్యాతి దేశం దాటి ఖండాలకు విస్తరించింది. తాజాగా, మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచ బ్యాంకు సారథ్యం వహించే అవకాశానికి ఆయన అడుగు దూరంలో ఉన్నారు. ఆయనే భారత సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త అజయ్ బంగా. అన్నీ అనుకున్నట్టు సాగితే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా, సిక్కు అమెరికన్‌గా బంగా చరిత్ర సృష్టిస్తారు.

పలు పదవులు..
ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో మాస్టర్‌కార్డ్‌ అధ్యక్షుడిగా, సీఈవోగా విధులు నిర్వర్తించారు. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ సంస్థలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని అమెరికా అధ్యక్షుడు తన ప్రకటనలో పేర్కొన్నారు.

జూన్ 2న బాధ్యతలు..
జూన్ 2వ తేదీన బంగా ప్రపంచ బ్యాంక్‌ సారథిగా పగ్గాలు చేపడతారు. అప్పటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బుధవారం సమావేశమై అజయ్‌ బంగాను అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. అత్యంత కీలకమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవి చేపట్టడానికి అర్హుడుగా భావించిన బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవికి నామినేట్‌ చేశారు. సాంప్రదాయికంగా ప్రపంచ బ్యాంక్‌ సారథ్యం అమెరికన్లకే దక్కుతోంది. తమ తరఫున ఆ పదవికి బంగా పేరును ప్రతిపాదించనున్నట్టు బైడెన్‌ ఫిబ్రవరిలోనే ప్రకటించారు. గతంలో మాస్టర్‌ కార్డ్‌ ఇంక్‌ చీఫ్‌గా వ్యవహరించిన బంగా ప్రస్తుతం జనరల్‌ అట్లాంటిక్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న 300 పైగా పెద్ద అంతర్జాతీయ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే యూఎస్‌–ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) చైర్మన్‌గాను, ఇంటర్నేషనల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌గాను కూడా బంగా పని చేశారు.

జన్మస్థలం పూణే
మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన బంగా పాఠశాల విద్యను సిమ్లాతో పాటు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌)లో అభ్యసించారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టాను అందుకున్న బంగా.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

కెరీర్ ప్రారంభం ఇలా..
నెస్లే ఇండియాతో కెరీర్‌ను ప్రారంభించిన బంగా ఆ తర్వాత భారత్‌, మలేషియాల్లో సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. అనంతరం 1996లో అమెరికాకు వెళ్లి పెప్సీకోలో 13 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 2009లో మాస్టర్‌కార్డ్‌ ప్రెసిడెంట్‌, సీఓఓగా బాధ్యతలు చేపట్టారు.

అవార్డులు.. పురస్కారాలు..
పారిశ్రామిక రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా బంగా పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular