Jay Bhattacharya: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దీంతో ఈ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. తనపై ఉన్న కేసుల విచారణను నిలిపివేయించారు. మరోవైపు.. తన ప్రభుత్వంలో ఉండే మంత్రులు, తన వైట్‌హౌస్ కార్యవర్గంలో ఉండే.. అధికారులను ఎంపిక చేసుకుంటున్నారు. విధేయులు, సమర్థులకు పదవులు అప్పగిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పదవులకు పలువురిని ఎంపిక చేశారు. ఇందులో భారత సంతతి వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా మరో భారత సంతతి వ్యక్తిని ట్రంప్ కీలక పోస్టుకు ఎంపిక చేశారు. దేశంలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు నాయకత్వం వహించడానికి ఆరోగ్య ఆర్థికవేత్త డాక్టర్ జే భట్టాచార్యను ఎంపిక చేశారు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 56 ఏళ్ల భట్టాచార్య తన ఎన్నికపై సంతోషం వ్యక్తం చేశారు ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్.కెన్నడీ జూనియర్‌తో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
ఆరోగ్య అమెరికాగా..
ఇక జై భట్టాచార్య నియామకంపై ట్రంప్ స్పందిస్తూ.. జైను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించడం నాకు సంతోషంగా ఉంది. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో ఎన్‌ఐహెచ్‌ను నడిపించడంతోపాటు దేశ ప్రజల ప్రాణాలు కాపాడే ఆవిష్కఱణలుచేసేందుకు భట్టాచార్య పనిచేస్తారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు ఇద్దరూ కలిసి కృషి చేస్తారు’ అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ నుంచి..
జై భట్టాచార్యా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో 1968లో జన్మించారు. ఎంబీబీఎస్ అనంతరం ఉన్నత విద్య కోసం 1997లో అమెరికా వెళ్లారు. స్టాన్‌ఫోర్డ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్, ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే ప్రొఫెసర్‌గా, నేషనల్ బ్యూరో ఎకనమిక్ రీసెర్చ్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల కోవిడ్ సమయంలో ఆయన చేసిన పరిశోధనలు కీలకంఆ మారాయి. కరోనా సమయలో నాటి అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శించిన వారిలో భట్టాచార్య కూడా ఉన్నారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని, లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిపుణులతో కలిసి బహిరంగ లేఖ రాశారు. ఇదిలా ఉంటే.. భట్టాచార్య మెడిసిన్, అర్ధశాస్త్రం, ఆరోగ్య విధానాలు, ఎపిడిమియాలజీ, స్టాటిస్టిక్స్, లా, పబ్లిక్ హెల్త్ సహా అనేక అంశాలపై ఇప్పటి వరకు 135 పరిశోధన పత్రాలు, జర్నల్స్ వివిధ గ్రంథాల్లో ప్రచురితమయ్యాయి.