Mike Waltz: ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఇండియా కాకస్‌ చీఫ్‌..!

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ ట్రంప్‌.. తన నూతన కార్యవర్గంపై కసరత్తు చేస్తున్నారు. వైట్‌హౌస్‌ కార్యాలయ కార్యవర్గం ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇండియన్‌ కాకస్‌ చీఫ్‌కు అరుదైన అవకాశం కల్పించారు.

Written By: Raj Shekar, Updated On : November 12, 2024 11:57 am

Mike Waltz

Follow us on

Mike Waltz: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. 2025, జనవరి 20న అధికార మార్పిడి జరుగనుంది. ఈ నేపథ్యంలో తన నూతన కార్యవర్గం, నూతన క్యాబినెట్‌ కూర్పులో ట్రంప్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కొత్త కేబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు కీలక పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక నిక్కీ హేలీకి ఎలాంటి పదవి ఇవ్వనని ప్రకటించారు. ఇక తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లోరిడా కాంగ్రెస్‌ సభ్యుడు అయిన మైక్‌ వాల్ట్‌జ్‌ను తన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా ఎంపిక చేశారు. దీంతో భారత కాకస్‌కు చీఫ్‌ అయిన మైక్‌ వాల్ట్‌జ్‌ భారత్‌తో అమెరికా రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మైక్‌ మైక్‌ వాల్ట్‌జ్‌ ఆఫ్ఘనిస్తాన్, మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా విస్తరణ కార్యక్రమాల్లోనూ పనిచేశారు. దీనికి ఆయన బ్రాంజ్‌ స్టార్‌తో సహా అనేక అవార్డులు గెలుచుకున్నారు. డిఫెన్స్‌ సెకెటరీ డొనాల్డ్‌ రమ్స్‌ ఫెల్డ్‌ ఆధ్వర్యంలో పెంటగాన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ విధాన సలహాదారుగా కూడా పనిచేశారు. ఆఫ్ఘాన్‌ నుంచి అమెరికా దళాల ఉప సంహరణపై హౌస్‌ ఆర్మ్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా జో బైడెన్‌ను ప్రశ్నించి వార్తల్లో నిలిచారు.

రక్షణ వ్యూహాల్లో దిట్ట..
మైక్‌ వాల్ట్‌జ్‌ బలమైన రక్షణ వ్యూహాలు రూపొందించడంలో దిట్ట. భారత్, చైనాతో సంబంధాలు మెరుగుపర్చడంలో అనుభవజ్ఞుడైన విదేశాంగ నిపుణుడు. అమెరికా–ఇండియా కూటమికి కీలకమైన ప్రతిపాదకుడు. భారత దేశంతో ముఖ్యంగా రక్షణ, భద్రతా సహకారంలో లోతైన సంబంధాలను పెంచుకున్నారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక కాంగ్రెస్‌నల్‌ కాకస్‌కు కో చైర్మన్‌గా 2024లో అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్‌ హిల్‌లో ప్రధాని మోదీ చేసిన చారిత్రక ప్రసంగంలో కీలక పాత్ర పోషించారు. వాల్ట్‌జ్‌ 2019 నుండి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. అతను అధ్యక్షుడు జో బైడెన్‌ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. హౌస్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ, హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ మరియు హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీలో ఈ టర్మ్‌లో పనిచేశాడు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి యూరప్‌ మరింత కృషి చేయాలని, అధ్యక్షుడిగా ఎన్నికైన వారి కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యానికి అనుగుణంగా అమెరికా తన మద్దతుతో మరింత కఠినంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

కాకస్‌లో 40 మంది..
ఇదిలా ఉంటే.. సెనేట్‌ ఇండియా కాకస్‌లో ప్రస్తుతం 40 మంది సభ్యులు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలు, భద్రతను ప్రభావితం చేసే దేశీయ, అంతర్జాతీయ సమస్యలపై జాతీయ విధానాలను రూపొందిచే ద్వైపాక్షిక కూటమి కాకస్‌. దీనిని 2004లో అప్పటి న్యూయార్‌ సెనేటర్, సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరీ క్లింటన్, సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ ఏర్పాటు చేశారు.