Global Warming: ఈ భూమిపై ఇక మనుగడ సాగించలేమా!?

2020 గణాంకాల ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో అమెరికా, చైనా తర్వాత స్థానం భారత్‌దే. గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం.. తక్షణం జాతీయ కార్యక్రమాన్ని రూపొందించాలి.

Written By: Raj Shekar, Updated On : May 16, 2023 3:30 pm

Global Warming

Follow us on

Global Warming: భూతాపం పెరుగుతోంది. భూమి నుంచి వెలువడుతున్న వేడి సెగలు ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో భూమి మరింత భగభగ మంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా సామాజిక, ఆర్థిక సవాళ్లకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ కార్యక్రమం(వైసీసీసీసీ), సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్‌ అండ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఎలక్షన్‌ రీసెర్చ్‌(సీ–ఓటర్‌) సంయుక్తంగా ‘పెరుగుతున్న భూతాపం.. భారతీయుల అవగాహన’ అనే అంశంపై 2022లో నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

సర్వే ఫలితాలు ఇవీ..
– సర్వేలో భూతాపం పెరుగుతోందని 90 శాతానికిపైగా అభిప్రాయపడ్డారు.

– 86 శాతం మంది పర్యావరణ మార్పుల ప్రభావానికి గురైనట్లు తెలిపారు. భూతాపం పెరుగుదలకు మానవచర్యలతోపాటు పర్యావరణ అంశాలూ కొంత మేర కారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

– భూతాపం పెరుగుదల, పర్యావరణ మార్పుల ప్రభావం కుటుంబాలపై పడుతోంది. వ్యక్తిగతంగానూ దీని పర్యవసానాలను చవిచూస్తున్నామని పేర్కొన్నారు.

– రానున్న 20 ఏళ్లలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు అత్యధిక మంది పేర్కొన్నారు.

– ప్రధానంగా అంటు వ్యాధులు ప్రబలడం, వడగాడ్పుల ముప్పు పెరగడం వంటివి ఎక్కువ అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.

– పదేళ్లలో వర్షపాతంలో మార్పులను స్పష్టంగా గుర్తిస్తున్నామని.. వర్షాలు పెరగడం లేదా తగ్గడం జరిగిందని చాలా మంది వెల్లడించారు. 44 శాతం మంది వర్షపాతం తగ్గిందని అభిప్రాయపడగా.. 34 శాతం మంది పెరిగిందని పేర్కొన్నారు.

– ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే రోజులు గతంలో కంటే పెరిగాయి.

– విపత్తుల పర్యవసానాల నుంచి బయటపడటానికి ఎక్కువ సమయం పడుతోంది. ఆర్థిక, సామాజిక పరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు.

వీటిపై దృష్టి సారించాలి..
2020 గణాంకాల ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో అమెరికా, చైనా తర్వాత స్థానం భారత్‌దే. గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం.. తక్షణం జాతీయ కార్యక్రమాన్ని రూపొందించాలి. అటవీ విస్తీర్ణం పెంచడం, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, విద్యుత్‌ వినియోగం వంటివాటి పట్ల ప్రత్యేక కార్యాచరణ అవసరం. లేకుంటే భవిష్యత్‌ తరాల మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగం చాలా వరకు తగ్గించాలి. విషవాయువులు గాలిలో కలవకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది.