Israel – Iran : ఇప్పటికే ప్రపంచం రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర పర్యవసానాలను చవిచూస్తోంది. దాన్ని మర్చిపోకముందే ఇజ్రాయిల్ – ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు గాని.. ప్రస్తుతానికైతే పశ్చిమసియాలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దేశంలోని ఓ దీవి పై దాడి చేసింది. ఇది ఇరాన్ దేశానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహూ సైనిక అధికారులతో భేటీ అయ్యారు. మరోవైపు మాపై దాడి చేస్తే సమర్థవంతంగా తిప్పికొడతామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ రెండు దేశాలు ఇలా పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో మధ్యలోకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇజ్రాయిల్ దేశానికి సంఘీభావంగా నిలిచారు. అయితే ఇరాన్ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయొద్దని ఇజ్రాయిల్ కు సూచించారు.. ఇలా దాడులు – ప్రతి దాడుల నేపథ్యంలో మధ్యధరా సముద్రం, పర్షియన్, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ దళాలు పహారా కాస్తున్నాయి.
ఇరాన్ కు ఆయువు పట్టు
ఇరాన్ దేశానికి ఖర్గ్ అనే దీవి ఆయువు పట్టు లాగా ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్ తీరానికి ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిద్వారా భారీగా పెట్రోలు ఎగుమతులు సాగుతుంటాయి. ఇరాన్ దేశం నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకునే చైనాకు.. ఇక్కడి నుంచే సరఫరా జరుగుతుంది. దీనిని గనుక ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తే.. చమురు ధరలు ఒక్కసారిగా ఐదు శాతం పెరుగుతాయని వ్యాపారం నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ – ఇరాక్ యుద్ధం సమయంలో సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ దీవిపై దాడులు జరిగాయి. ఆ సమయంలోను ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవడంతో ఈ యుద్ధం సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ దీవి ద్వారా ఇరాన్ ప్రపంచంలోని పలు దేశాలకు చమరు సరఫరా చేస్తుంది. ఇరాన్లోని పలు దీవులకు ఈ ప్రాంతం నుంచి చమురు సరఫరా చేసి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంది. పర్సన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన టెర్మినల్స్ ఈ తీర ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చమురు ఎగుమతి చేస్తాయి. హెర్మూజ్ జల సంధి ద్వారా చమురు ఓడలు పర్షియన్ గల్ఫ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ జల సంధి భాగం ఎక్కువగా ఇరాన్ ఆధీనంలో ఉంది.. ఒకవేళ ఈ మార్గాన్ని కనుక ఇరాన్ మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. అయితే ఇరాన్ అణు విద్యుత్ తయారీ కేంద్రాల మీద దాడులు చేయొద్దని ఇజ్రాయిల్ కు సూచించిన అమెరికా.. ఈ దీవి పై దాడులు చేయకూడదని చెప్పకపోవడం విశేషం. ఈ దీనిపై ఒకవేళ ఇజ్రాయిల్ దాడులు చేస్తే చమురు సరఫరా ఆగిపోతుంది. ఇరాన్ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అయితే అమెరికా లక్ష్యం కూడా అదే కావడంతో.. ఇజ్రాయిల్ దేశానికి అందుకే బాసటగా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి.