https://oktelugu.com/

Sunita Williams-Butch Will More : పీల్చేందుకు ఆక్సిజన్ కూడా ఉండదు.. అలాంటి చోట సునీత, బచ్ విల్ మోర్ అన్ని రోజులు ఎలా ఉండగలుగుతారు?

ఇటీవల ఒక ప్రయోగం నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, బచ్ విల్ మోర్ వెళ్లారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా వారు స్పేస్ లోకి ప్రవేశించారు. అయితే వీరు ఇప్పట్లో తిరిగి భూమ్మీదకు వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 9, 2024 / 11:01 AM IST

    Sunita Williams-Butch Will More

    Follow us on

    Sunita Williams-Butch Will More :  స్టార్ లైనర్ క్యాప్సూల్ భూమ్మీదికి ఖాళీగానే తిరిగి వచ్చింది. అది అంత సురక్షితం కాకపోవడంతో నాసా(అమెరికా అంతరిక్ష సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సునీత, బచ్ విల్ మోర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది.. గత చరిత్రను చూసుకుంటే కొందరు ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు) సుదీర్ఘకాలం స్పేస్ లో ఉన్నారు. అయితే చాలా కాలం పాటు అక్కడే ఉంటే ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందట. ఎందుకంటే అంతరిక్ష కేంద్రంలో మైక్రో గ్రావిటీ వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఎముకలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. జీర్ణశక్తి పనితీరు మందగిస్తుంది. కళ్ళు కూడా తమ దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. గుండె, శరీర కండరాలు, నాడులు బలహీనపడే అవకాశం ఉంది. చిన్న పేగులో నుంచి ఆహారం నిదానంగా కదులుతుంది. దీనివల్ల శరీరం బరువు పెరుగుతుంది..

    ఎక్కువ కాలం ఉంటే..

    వివిధ ప్రయోగాల నిమిత్తం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటారు. అలా ఉన్నవాళ్లు 70 శాతం మందిలో స్పేస్ ఫ్లైట్ అసోసియేషన్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ సమస్య ఎదురవుతుంది. దీనివల్ల ఆస్ట్రోనాట్ తలలో ఎక్కువగా ద్రవాలు ఊరుతుంటాయి. ఇవి నేత్రాల వెనుక పోగుపడతాయి. అలాంటి సమయంలో చూపు దెబ్బతింటుంది.. శరీరం భార రహిత స్థితిని చవి చూడటం వల్ల గుండె పనితీరు ప్రభావితం అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అది సంకోచానికి గురి కావచ్చు. అదే సమయంలో కండరాల మోతాదు తగ్గుతుంది. అవి బలహీనపడేందుకు కారణం అవుతుంది.. అంతరిక్షానికి వెళ్ళినప్పుడు శరీరం రక్త కణాల సంఖ్యను త్వరగా కోల్పోతుంది. అలాంటప్పుడు ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. దానికోసం ఆస్ట్రోనాట్స్ కు సరఫరా చేసే ఆహారంలో అనేక మార్పులు చేర్పులు చేపడుతుంటారు. ఇక ఇవే కాక అంతరిక్షంలో శరీరం ఏ స్థితిలో ఉందో, ఎక్కడ కేంద్రీకృతమై ఉందో వెల్లడించే సిగ్నల్స్ మెదడుకు అందే ప్రక్రియ అధ్వానంగా మారుతుంది.

    ఎందుకిలా అవుతుంది

    స్పేస్ లో మనిషి శరీరం అనేక ఒడిదుడుకులకు గురవుతుంది. రేడియేషన్, వాతావరణం లో తేడాలు, స్వల్పంగా గురుత్వాకర్షణ వంటివి దీనికి కారణం అవుతున్నాయి. సమయం కూడా ఇందుకు ఒక కారణమే.. సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉంటే అది శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ గడిపే సగటు కాలం 1960లో ఒక నిమిషం నుంచి ఒక నెల వరకు ఉండేది. 2020లో ఇది 10 నిమిషాల నుంచి 6 నెలల వరకు పెరిగింది. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములు పాల్గొనే ప్రతి ప్రయోగము 6 నెలల వరకు కొనసాగుతోంది. అంతరిక్ష కేంద్రంలో ఎన్ని రోజులు ఉన్నప్పటికీ ఆస్ట్రోనాట్స్ నిర్దిష్టమైన వ్యాయామ నియమాలు పాటించాలి. కక్ష్య లోకి చేరుకున్నప్పుడు శరీరం మీద ఏమాత్రం ఒత్తిడి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్ట్రోనాట్స్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండేందుకు భూమ్మీద ఉన్న వారితో మాట్లాడుతుంటారు..

    క్యాప్సూల్స్ ప్రభావంపై

    అంతరిక్ష కేంద్రానికి మనుషులను తీసుకెళ్లే క్యాప్సూల్స్ ఎంత మేరకు ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తున్నాయనే దానిపై ఇంతవరకు ఒక స్పష్టమైన అవగాహన లేదు. గత ఏడాది దీనికి సంబంధించి నేచర్ కమ్యూనికేషన్ పేపర్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో స్పేస్ లో పోషకాలు, మందులు ఎలా విచ్చిన్నానికి గురవుతున్నాయో అనే అంశంపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. డిఎన్ఏ, అమైనో ఆమ్లాల సంశ్లేషణ లో భాగమయ్యే జీవక్రియ మార్గాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు వారు గుర్తించారు. శరీరంలో ఐరన్ స్థాయి పెరగడం, మూత్రంలో మెగ్నీషియం పరిమాణం తగ్గడం వాటిపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. నేత్రాల వెనుక ద్రవాలు పోగుపడే సమస్యను పరిశీలించేందుకు ప్రత్యేకమైన పోర్టబుల్ ఆప్టికల్ కో హెరెన్స్ టోమోగ్రఫీ పరికరాన్ని అమర్చాలని నాసా రెండు సంవత్సరాల క్రితమే ఒక నివేదికలో సూచించింది. ఒకవేళ గనుక దానిని అమర్చేందుకు ప్రస్తుత పరిస్థితులు సహకరిస్తే మనిషి పుర్రె భాగంలో ఒత్తిడిని తగ్గించే మాత్రలు వేసుకోవడం.. హ్యూమన్ సెంట్రిఫ్యూ గేషన్ ద్వారా కృత్రిమ గ్రావిటీని కలిగించడం వంటి పరిష్కార మార్గాలను అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.