US Election 2024: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరుగనున్నాయి. దీంతో అభ్యర్థులు తుది విడత ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సర్వే సంస్థలు కాబోయే అధ్యక్షులు ఎవరు అనే అంశంపై ప్రజల నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ సర్వే సంస్థల అంచనాలకు ఓటరు నాడి చిక్కడం లేదు. ప్రధాన పోటీ అధికార డెమొక్రటిక్ పార్టీ, విపక్ష రిపబ్లిక్ పార్టీ మధ్యనే ఉంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ ఆధిక్యంకుడా తాజాగా ఇంకా తగ్గింది. ఇలాంటి ఉత్కంఠ నేపథ్యంలో అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ శాస్త్రవేత్త అలన్ లిచ్‌మన్ సంచలన జోష్యం చెప్పారు. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలా హారిస్ బాధ్యతలు చేపడతారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో 40 ఏళ్లుగా కచ్చితమైన రికార్డు లిచ్‌మన్‌కు ఉంది.
13కీ ఫార్ములా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అంచనా వేసేందుకు లిచ్‌మన్ 13కీ ఫార్ములను తయారు చేశారు. రష్యన్ జియోఫిజిసిస్టు వ్లాదిమిర్ కీలిస్–బోరోక్‌తో కలిసి 13 కీలలో ఆరు కన్నా ఎక్కువ కీలు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వస్తే ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతారని అంచనా. అంతకన్న తక్కువ వస్తే అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఈ ఫార్ములా చెబుతుంది. ప్రొఫెసర్ లిచ్‌మన్ 1984 నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన అంచనాలు నిజమయ్యాయి.
వ్యతిరేకంగా 4 కీలే..
13కీ ఫార్ములాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం 4 కీలు మాత్రమే ఉన్నాయి. 9 కీలు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారని లిచ్‌మన్ అంచనా వేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి రాలేరని తెలిపారు. డెమొక్రాట్లు 2022లో యూఎస్ హౌస్ సీట్లు కోల్పోవడం వలన ఒక కీ కోల్పోయారని తెలిపారు. సిట్టింగ్ అధ్యక్షుడు పోటీ నుంచి తప్పుకోవడం ద్వారా మరో 3 కీలు కోల్పోయారని తెలిపారు. అధికార పార్టీ ఓడిపోతుందని చెప్పడానికి ఇంకా 2 కీలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మహిళా అధ్యక్షరాలు కమలా హారిస్ అవుతారని లిచ్‌మన్ వెల్లడించారు.