Harad-Al Bata Road : రోడ్డు మీద ప్రయాణం చేయడం చాలా మందికి ఇష్టం. అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తే ఆ కిక్కే వేరు కదా. ఇక వెనకాల బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఫుల్ ఖుషీ కావచ్చు కదా. మీలో చాలా మందే ఈ ఎక్స్ పీరియన్స్ ను చేసి ఉంటారు. కానీ చాలా తక్కువ దూరం వెళ్లారు కావచ్చు. అయినా దారిలో వెళ్తుంటే మధ్యలో సడన్ బ్రేక్, ఆగుము అని బోర్డులు, లేదా మలుపులు ఉంటే అబ్బా చిరాకు వస్తుంటుంది కదా.. కానీ అన్నింటికి ఒక అర్థం అందులో పరమార్థం కూడా దాగి ఉంటాయి. ఇదంతా ఎందుకు కానీ…
మీరు ఎప్పుడైనా ఒక్క మలుపు కూడా లేకుండా ఏదైనా దారి గుండా ప్రయాణం చేశారా? వెళ్లినా ఒక గల్లీ, లేదా ఓ అర్ద కిలోమీటర్ వెళ్లి ఉంటారు. కానీ మలుపు లేకుండా సడన్ బ్రేకులు లేకుండా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే.. వామ్మో నిజంగా అలాంటి దారి ఉంటుందా అనుకుంటున్నారా? కానీ సౌదీ అరేబియాలో మాత్రం అసాధారణ స్థాయిలో కొన్ని వందల కిలోమీటర్ల దూరం పాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక హైవే ఉంది! రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా నిర్మించిన హైవే 10 లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒక్క మలుపు లేదంట..
చమురు, గ్యాస్ నిల్వల నగరమైన హరద్ నుంచి పొరుగునున్న యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా వరకు ఉన్న ఈ హైవే పూర్తిగా నిటారుగానే ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని 146 కి.మీ ఐర్ హైవే పేరిట ప్రపంచంలోనే అతిపొడవైన నిటారు రోడ్డు రికార్డును సౌదీలోని హైవే 10 బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. దేశ రాజు అబ్దుల్లా కోసం ముందుగా దీన్ని ప్రైవేటు రోడ్డుగా ఇలా ప్రత్యేకంగా నిర్మించారట. అయితే ప్రస్తుతం చమురు రవాణాకు దీన్ని వినియోగిస్తున్నారు.
ఈ హైవే నిటారుగా ఉండటమే కాదు.. మొత్తం 256 కి.మీ. మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. అలాగే ఈ దారి గుండా వెళ్తుంటే ఎక్కడా ఒక్క చెట్టు లేదా కట్టడం కూడా కనిపించదట. అందుకే ఈ రోడ్డుపై వాహనాలు కేవలం 2 గంటల వ్యవధిలోనే 256 కి.మీ. దూరం వరకు వెళ్తారు అని తెలుస్తోంది అయితే అక్కడక్కడా ఒంటెలు, కంగారూలు మాత్రం ఉన్నట్టుండి రోడ్డు దాటుతుంటాయని.. అందువల్ల వాహనదారులు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు తప్పవని కూడా హెచ్చరిస్తారట అధికారులు.