Imran Khan: ఇమ్రాన్‌ఖాన్.. మాజీ క్రికెటర్.. పాకిస్తాన్ మాజీ ప్రధాని. ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపుఒందాడు. పాకిస్తాన్‌కు ప్రపంచ కప్ అందించాడు. రిటైర్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చారు. కొత్త పార్టీ పెట్టి ఏకంగా ప్రధాని అయ్యారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అవినీతి ఆరోపణల కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను జైల్లో పెట్టింది. అయితే కొన్ని రోజులుగా ఆయన గురించిన సమాచారం ఏదీ బయటకు రావడం లేదు. ప్రస్తుతం అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన కొద్ది వారాలుగా ప్రజల ముందుకు రాకపోవడంతో, సోషల్ మీడియాలో పలువురు ఆయన ఆరోగ్యం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
కార్యక్తల ఆందోళన..
ఇమ్రాన్ స్థాపించిన తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. మాజీ ప్రధాని సోదరీమణులు కూడా జైలుకు చేరుకుని ఇమ్రాన్ ఆరోగ్యం గురించి అధికారులను కలవాలని ప్రయత్నించారని, కానీ భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయనే వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో నిరసనలు మరింత తీవ్రంగా మారాయి.
బలూచిస్తాన్ వ్యాఖ్యలతో పెరిగిన ఉద్రిక్తత
ఇమ్రాన్ మరణించారని బలూచిస్తాన్ విదేశాంగ విభాగం చేసిన ఎక్స్ పోస్ట్ పెద్ద చర్చనీయాంశమైంది. ఆ సంస్థ పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, నిఘా సంస్థ ఐఎస్‌ఐనే ఇందుకు కారణమని ఆరోపించింది. ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయి దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. అయితే పాకిస్తాన్ అధికార వర్గాలు ఈ ప్రచారాలను కొట్టిపారేస్తూ, ఇమ్రాన్ సురక్షితంగానే ఉన్నారని చెబుతున్నాయి. గతంలోనూ ఆయన అనారోగ్యంపై పుకార్లు వ్యాపించినప్పటికీ, అవన్నీ నిరాధారమని తేలిందని గుర్తుచేస్తున్నారు.
రాజకీయ ప్రయాణం..
క్రికెట్‌లో పాకిస్తాన్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ఇమ్రాన్, రాజకీయాల్లోనూ అదే సంకల్పంతో అడుగుపెట్టారు. సుమారు మూడు దశాబ్దాల కఠిన పోరాటం తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2018 నుండి 2022 వరకు పదవిలో కొనసాగారు. రష్యా పర్యటన, అంతర్జాతీయ రాజకీయ భిన్నాభిప్రాయాలు, దేశీయ రాజకీయ ప్రతిపక్షం కారణంగా చివరికి అధికారాన్ని కోల్పోయారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, రక్షణ, రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో పాకిస్తాన్ రాజకీయ వాతావరణం మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది.