US embassy on Delhi blast: మనం అనేక సందర్భాలలో చెప్పుకున్నాం. ఇక ముందు కూడా చెప్పుకుంటాం.. అమెరికా అంటేనే ఒక అవకాశవాద దేశం. సామ్రాజ్యవాదానికి ఆ దేశం పెట్టింది పేరు. ప్రపంచం మొత్తం మారకం డాలర్ తో ముడిపడి ఉంది కాబట్టి అమెరికా అని దేశాల నెత్తి మీద ఎక్కి సవారీ చేస్తోంది. అడ్డగోలుగా ప్రవర్తిస్తోంది. నచ్చిన దేశాల మీద ఒకరకంగా.. నచ్చని దేశాల మీద మరొక రకంగా వ్యవహరించడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడం.. ప్రమాదాలను కొని తేవడం.. వాటిని ప్రపంచం నెత్తి మీద రుద్దడం అమెరికాకు అలవాటే. తనకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా.. అనుకూలంగా లేకపోతే మరొక విధంగా ప్రవర్తించడం అమెరికాకు అలవాటు ఎప్పటినుంచో ఉంది.
ఉగ్రవాదంపై అమెరికా జరిపే పోరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక నోటితో పాకిస్తాన్ దేశాన్ని తిడుతుంది. అంతేకాదు లాడెన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిని పాకిస్తాన్లోనే చంపేస్తుంది. కానీ అదే పాకిస్తాన్ దేశంతో దోస్తీ కొనసాగిస్తుంది. ఉగ్రవాదు దేశం అని తిడుతూనే.. వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఉంటుంది. ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉంటుంది. పైగా తన యుద్ధ విమానాలను విక్రయించి అన్ని విధాలుగా పాకిస్తాన్ దేశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇటీవల పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో ట్రంప్ తో చాలాసేపు ముచ్చటించారు. పైకి ఇది సాధారణ భేటీ మాదిరిగా కనిపించినప్పటికీ.. పాకిస్తాన్లో లభ్యమయ్యే వనరుల మీద ట్రంప్ కన్ను వేశాడు. అందువల్లే అతడిని తన వద్దకు పిలిపించుకున్నాడు. అమెరికా కంపెనీలు పాకిస్థాన్లో తవ్వకాలు జరిపి.. విలువైన ఖనిజాలను వెలికి తీసే విధంగా రూపకల్పన చేశాడు.
పాకిస్తాన్ దేశంతో ఖనిజాల తవ్వకానికి ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా అసలు ముఖచిత్రం బయటపడుతోంది. ఉగ్రవాదం విషయంలో అమెరికా ద్వంద్వ నీతి బట్టబయలవుతోంది. మనదేశంలో దాడులు జరిగితే ఒక విధంగా.. పాకిస్తాన్లో జరిగితే మరొక విధంగా స్పందించింది. ఢిల్లీలో జరిగిన దాడులపై ఎక్కడా కూడా ఉగ్రవాదం అనే పేరును అమెరికా వాడలేదు. ఆ పేరును ప్రస్తావించకుండా అమెరికా ఎంబసీ ట్వీట్ చేసింది. అది కూడా ఘటన జరిగిన ఒక రోజు అనంతరం ఒక పోస్ట్ పెట్టి.. ఏదో మమ అనిపించింది.. పాకిస్తాన్లో దాడి జరిగితే మాత్రం కన్నీరు పెట్టింది. పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు పాకిస్తాన్ దేశానికి కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.
ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా చేయాల్సిన పని ఇది కాదు. పైగా ప్రపంచ దేశాలలో ఏవైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే అండగా ఉండాలి. అవసరమైతే భరోసా కల్పించాలి. అలాకాకుండా అవసరాల తీరుగా వ్యవహరిస్తే మాత్రం అమెరికా మీద ప్రపంచ దేశాలకు ఉన్న ఆకాస్తా నమ్మకం పోతుంది. అంతేకాదు ప్రపంచం మీద సాగిస్తున్న పెత్తనం కూడా సడలిపోతుంది. పైగా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా సాగిస్తున్న విధానాలు.. ప్రపంచం మీద చూపిస్తున్న పెత్తనాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇవి ఇలాగే సాగితే మాత్రం అమెరికా పెత్తనానికి రోజులు చెల్లిపోయినట్టే.