https://oktelugu.com/

Donald Trump : వామ్మో ట్రంప్‌ పుస్తకానికి అంత డిమాండా.. విడుదలైన గంటల్లోనే అమ్మకం.. ఏం రాశాడో తెలుసా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ర్యాలీలు, సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 4, 2024 / 08:30 PM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump :  అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది చివరన జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల రేసులో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నారు. ఇద్దరి మధ్యనే పోటీ నెలకొంది. మొన్నటి వరకు రేసులో ముందు ఉన్న ట్రంప్‌ తాజాగా ప్రీపోల్‌ సర్వేలో వెనకబడ్డారు. కీలక రాష్ట్రాల్లోనే ట్రంప్‌ వెనకబడడం ఇప్పుడు అమెరికాలో హాట్‌ టాపిక్‌ అయింది. మరోవైపు ఇద్దరు అభ్యర్థులూ ఓటర్లను ఆకాట్టుకునేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌ ఏకంగా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తనను అధ్యక్షుడిగా గెలిపిస్తే ఉచిత ఐవీఎఫ్‌ చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కమలా హారిస్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారు. ఆమె నవ్వు, అందం గురించి మాట్లాడిన ట్రంప్‌.. తాజాగా కమలా యాసపైనా వ్యంగాస్త్రాలు సంధించారు. పార్టీ కమలా హారిస్‌పై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించినా ట్రంప్‌ నోటి దురుసు ఆగడం లేదు. ఇదిలా ఉంటే.. ట్రంప్‌ తాజాగా ఓ పుస్తకం విడుదల చేశారు. అది అమ్మకాల్లో రికార్డు సృష్టించింది.

    సేవ్‌ అమెరికా పేరుతో..
    అమెరికా అధ్యక్ష ఎన్నికలో రేసులో వెనుకబడినట్లు సర్వే సంస్థలు ప్రకటించడంతో ట్రంప్‌ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. తాజాగా ఆయన కొత్త పుస్తకం ’సేవ్‌ అమెరికా’ కూడా హవా చూపిస్తోంది. విడుదలైన కొద్దిగంటల్లోనే అమెజాన్‌ బెస్ట్‌ సెల్లర్గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ ధర ఉన్నప్పటికీ.. అమెజాన్లో ’ప్రెసిడెంట్స్‌ అండ్‌ హెడ్స్‌ ఆఫ్‌ ది స్టేట్‌ బయోగ్రఫీస్‌’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది. అధ్యక్షుడిగా తన పదవీకాలం, ప్రచార సమయంలోని విశేషాలను ట్రంప్‌ దీనిలో పొందుపరిచారు.

    కాల్పుల ఫొటోనే కవర్‌ పేజీపై..
    జులై నెలలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. రక్తమోడుతున్న గాయంతో ఒక్కక్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్‌.. ఆ వెంటనే తేరుకొని వేదికపై పిడికిలి బిగించి, ఫైట్‌ అంటూ నినదిస్తున్న సమయంలో తీసిన ఫొటో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ దృశ్యాన్నే ఆయన కవర్‌ పేజ్‌పై వాడారు. అప్పటి జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్, ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ఉన్న ఫొటోలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. అలాగే మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ విమర్శలు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో భేటీని సమర్ధించుకోవడం ఇందులో కనిపిస్తుందని తెలిపింది.

    తన పాలనా తీరుపైనే పుస్తకం..
    తన గత పదవీకాలంతో పాటు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలని ఆయన యోచిస్తున్నారో ఈ పుస్తకంలో ట్రంప్‌ వివరించారు. ‘సేవ్‌ అమెరికా’లో తన తొలిపాలనకు సంబంధించిన ముఖ్యఘట్టాలను పొందుపరిచారు. పన్నులు, అంతర్జాతీయ దౌత్యం, సరిహద్దు భద్రత వంటి అంశాలను ప్రస్తావించారు‘ అని అమెజాన్‌ వెల్లడించింది. ఈ పుస్తకం గురించి తన సోషల్‌ మీడియా యాప్‌ ’ట్రూత్‌’ ట్రంప్‌ ప్రమోట్‌ చేసుకున్నారు. అందులో పొందుపరిచిన ప్రతిఫొటోను తానే ఎంపిక చేసినట్లు చెప్పారు. దేశభక్తులు ఈ చరిత్ర తెలుసుకోవడం తప్పనిసరనే అర్ధంలో పోస్టు పెట్టారు.