Donald Trump Tariff: వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆ దేశానికి వెళ్లి పట్టుకొచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పొగరు తలకెక్కింది. ఇప్పటికే అగ్రదేశం అన్న అహంభావంతో విర్రవీగుతూ అనేక దేశాలపై సుంకాలు విధించారు. తాజాగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని వ్యూహం రచిస్తున్నాడు. ఎలాగైనా తీసుకుంటామని బెదిరిస్తున్నాడు. దీంతో ట్రంప్ హెచ్చరికను యురోపియన్ యూనియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. డెన్మార్క్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించిన దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
8 ఐరోపా దేశాలపై సుంకాలు..
ట్రంప్ ప్రతిపాదన వ్యతిరేకించిన 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్‌కు ఇంతకాలం అండగా నిలిచిన ఈయూ దేశాలు ఇప్పుడు ట్రంప్ తీరుపై మండిపడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ చర్యను తప్పుడు చర్యగా ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మ్యాక్రోన్ ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదయోగ్యం లేదని స్పష్టం చేశారు. ఈయూ విదేశాంగ విధాన ముఖ్యురాలు కాజా కల్లాస్, చైనా, రష్యా ప్రయోజనం పొందుతాయని హెచ్చరించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ బ్లాక్‌మెయిల్‌కు లొంగేది లేదని ప్రకటించారు.
డెన్మార్క్‌లో నిరసనలు..
మరోవైపు గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా వైఖరిని నిరసిస్తూ డెన్మార్క్‌లో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఆదోళనలు చేస్తున్నారు. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సెన్ ఈ ప్రకటన ఆశ్చర్యకరమని చెప్పారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అంతర్జాతీయ చట్టాలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. నాటో సభ్యులుగా గ్రీన్‌లాండ్ భద్రత ఉమ్మడి బాధ్యత అని స్టార్మర్ ఉద్ఘాటించారు.
గ్రీన్‌లాండ్ వివాద నేపథ్యం
ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని పదేపదే ప్రకటిస్తున్నారు. ఈ ప్రాంతం ఆర్కిటిక్ భద్రత, వనరులకు కీలకం. ట్రంప్ ప్రతిపాదనను ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ వ్యతిరేకిస్తున్నాయి. డెన్మార్క్‌కు మద్దతుగా తమ బలగాలు తరలించాయి. ఈ చర్యలకు ప్రతీకారంగా ట్రంప్ సుంకాలు ప్రకటించారు.
ఐరోపా దేశాలు అమెరికా అధికారులతో చర్చలు షెడ్యూల్ చేశాయి. నాటో ఐక్యతకు ఇది సవాలుగా మారింది. ట్రంప్ ఈ ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తారా అనేది చూడాలి. మిత్రరాజ్యాల మధ్య విభేదాలు ప్రపంచ రాజకీయాల్లో మార్పులు తీసుకురావచ్చు.
