Donald Trump: ట్రంప్ అత్యంత వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు. అమెరికా ప్రయోజనాల కోసం ఏమైనా చేసే ట్రంప్.. తన పదవిని మరింత సుస్థిరం చేసుకోవడానికి ఎంత దాకైనా వెళ్తాడు. అందు గురించే తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అమెరికన్ ప్రజలలో జాతీయవాదాన్ని పైకి లేపాడు.. అమెరికన్లకే ప్రయోజనాలు అందాలని గట్టిగా నినదించాడు. వినూత్నంగా ప్రచారం చేశాడు. అందరి మనసులు చూరగొన్నాడు. ప్రత్యర్థి పార్టీపై నిప్పులు చెరిగాడు. అమెరికాను బాగుచేద్దామని.. ప్రపంచ శక్తిగా ఆవిర్భవించేలా చేద్దామని నినాదాలు చేశాడు. అవి సగటు అమెరికన్ ను ఆలోచింపజేశాయి. దీంతో ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలిచాడు. వాస్తవానికి గతంలో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్.. కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయన మరోసారి అధ్యక్షుడు కాలేకపోయారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా నష్టపోయింది. అందువల్లే ట్రంప్ వైపు అమెరికా ప్రజలు మొగ్గు చూపించారు. అమెరికన్ ఏలాలని విష్పష్టమైన తీర్పు ఇచ్చారు.
సోషల్ మీడియాలో సంచలనం
మరికొద్ది రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. అయితే ఈలోగా ఆయన చేసిన ఒక ట్విట్ సోషల్ మీడియాలో సంచలనగా మారింది. ప్రధానమంత్రిగా ఇటీవల జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు.. దీంతో “ఓహ్ కెనడా” అంటూ ఒక మ్యాప్ ను ఆయన షేర్ చేశారు. ఇది అమెరికాలో కెనడా విలీనం అయినట్టు చూపిస్తోంది. కెనడా విస్తీర్ణం 98.84 లక్షల కిలోమీటర్లు. అమెరికా 98.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఒకవేళ అమెరికా, కెనడా కలిసిపోతే 1.98 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో అతిపెద్ద దేశంగా అమెరికా ఏర్పడుతుంది. ఇప్పటివరకు అతి పెద్ద దేశంగా రష్యా ఉంది. ఒకవేళ గనుక కెనడా అమెరికాలో విలీనం అయితే అతిపెద్ద దేశంగా అమెరికా ఏర్పడుతుంది. అయితే ఇది ట్రంప్ ఫోటో షేర్ చేసినంత ఈజీ కాదు. ఎందుకంటే కెనడా అమెరికాలో విలీనం కావడం దాదాపు అసాధ్యం. పైగా కెనడా భౌగోళిక స్వరూపం.. అమెరికా భౌగోళిక స్వరూపం ఒకే విధంగా ఉండవు. రాజకీయంగా సాధ్యం కాదు.. ట్రంప్ వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు కాబట్టి.. తరచూ ఏదోక విషయాన్ని గెలుకుతూ ఉంటాడు కాబట్టి.. ఇప్పుడు కెనడాలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది కాబట్టి.. అందువల్లే ఈ విధమైన మ్యాపు రూపొందించి ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు ట్రూడో కు ట్రంప్ కు మొదటినుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉంది. పైగా ట్రూడో బైడన్ కు అనుకూల వ్యక్తి అని పేరుంది. అందువల్లే ట్రంప్ ఈ విధంగా ఫోటో షేర్ చేసి ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేయడంతో గ్లోబల్ మీడియా ప్రముఖంగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఊహించినట్టుగానే చైనా మీడియా ఈ విషయానికి దూరంగా ఉండటం విశేషం.