Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసలపై ఉక్కుపాధం మోపుతానని ట్రంప్ ప్రకటించారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాధంతో ముందుకు సాగుతానని తెలిపారు. అమెరికన్లకే స్థానికంగా అవకాశాలు దక్కాలని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాలో హెచ్–1బీ వీసాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానికులకే అధిక అవకాశాలు కల్పిస్తామన్న హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1వీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తోపాటు, డోజ్ సహ సారథి వివేక్ రామస్వామి కూడా సమర్థించారు. ఈ తరుణంలో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కూడా హెచ్–1వీ వీసాల జారీని సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థులైన వ్యక్తులే కావాలని ట్రంప్ పేర్కొన్నారు. అందుకోసమే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ పీపుల్స్ కోసమే..
అమెరికాకు ఎప్పుడూ సమర్థులైన స్మార్ట్ పీపుల్స్ కావాలి. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగు పెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగబోతోంది. దేశానికి నైపుణ్యం ఉన్న కార్మికులు కూడా అవసరం అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికాలోని మార్ – ఏ – లాగో రిసార్ట్‌లో ట్రంప్ స్థానిక మీడియాతో మాట్లాడారు. హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదని స్పష్టం చేవారు. నిపుణులే అమెరికాకు కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అన్న ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు.
భవిష్యత్‌లో ఆగ్రహావేశాలు..
ఇదిలా ఉంటే హెచ్–1బీ వీసాలకు తను అనుకూలమే అని, కేవలం నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ పడితుడు క్రేగ్ ఆగ్రోనోఫ్ తెలిపారు. ఐటీ ఉద్యోగాలు హెచ్–1బీ వీసాదారులకే దక్కితే స్థానిక ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నదానికి ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. విదేశీయులు తక్కువ వేతనాలకే పని చేస్తుండడంతో అమెరికా కంపెనీలు కూడా విదేశీ ఐటీ నిపుణులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.