Donald Trump Comments On Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్–అమెరికా బంధాలు బలోపేతమవుతాయని అంతా ఆశించారు. మోదీ తనకు మంచి మిత్రుడు అని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పుకున్నారు. ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కానీ టారిఫ్‌ల పేరుతో ట్రంప్ భారత్‌పై భారం వేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో ధమ్కీలు ఇస్తున్నాడు. ఇక వాణిజ్య ఒప్పందం విషయంలోనూ ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా ట్రంప్ హౌస్ రిపబ్లికన్ సమావేశంలో మాట్లాడుతూ, మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ల కారణంగా మోదీ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ పన్నులు అమెరికాకు భారీ ఆదాయాన్ని తెచ్చాయని, వాణిజ్య భాగస్వాములను మొగ్గు చూపించేలా చేశాయని పేర్కొన్నారు.
అపాచీ హెలికాప్టర్లు ఆలస్యం..
భారత్ 68 అపాచీ యుద్ధ హెలికాప్టర్ల కోసం పెద్ద ఆర్డర్ ఇచ్చింది, అయితే డెలివరీలో ఆలస్యం అవుతోందని ట్రంప్ వెల్లడించారు. మోదీ తనతో చర్చించి వేగవంతమైన డెలివరీ కోరారని ఆయన గుర్తుచేశారు. ఇక ఎఫ్–35 ఫైటర్ జెట్‌లు సహా ఆయుధ వ్యవస్థల వితరణను వేగవంతం చేయాలని డిఫెన్స్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చామని ట్రంప్ స్పష్టం చేశారు.
టారిఫ్‌లతోనే ఒత్తిడి..
ట్రంప్ మోదీతో మంచి సంబంధం ఉందని చెప్పినప్పటికీ, టారిఫ్‌లు రెండు దేశాల మధ్య ఆర్థిక ఒత్తిడిని సృష్టించాయి. భారత్ గత దశాబ్దంలో అమెరికా నుంచి గణనీయమైన రక్షణ పరికరాలు కొనుగోలు చేసింది. ట్రాన్స్‌పోర్ట్ విమానాలు, హెలికాప్టర్లు ఇందులో కీలకమైనవి. భారత్‌తో రక్షణ ఒప్పందాలు రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరుస్తున్నాయి.
మోదీతో పోలిస్తే ట్రంప్ జీరో..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మోదీతో పోలుస్తూ జియోపాలిటిక్స్ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వెనిజులా చర్యలను స్వల్పకాలిక విజయాలుగా పేర్కొన్నారు. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగేళ్లకు ఒకసారి నాయకత్వ మార్పు విధానాల స్థిరత్వాన్ని కలిగించదని వాదించారు. తదుపరి అధ్యక్షుడు ఈ నిర్ణయాలను సులభంగా రద్దు చేయగలడని హెచ్చరించారు. వెనిజులా చమురు మొత్తాన్ని అమెరికా కంపెనీలు స్వాధీనం చేసుకుంటాయన్న అంచనాలను అతిశయోక్తిగా పేర్కొన్నారు. ప్రస్తుత రోజువారీ 8 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి (గతంలో 30 లక్షలు) పెంచాలంటే రాజకీయ స్థిరత్వం, పెట్టుబడి నమ్మకం అవసరమని స్పష్టం చేశారు.
మోదీకి ప్రజాదరణ ఎక్కువ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ దశాబ్దకాలం పైగా ఉన్న ప్రజాస్వామ్య బలాన్ని బ్రెమ్మర్ ప్రశంసించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా నాయకుడిలా స్థిరమైన నాయకత్వం భారత్‌లో కనిపిస్తుందని తెలిపారు. ట్రంప్ ప్రజాదరణ తక్కువగా ఉందని స్పష్టం చేశారు. మూడేళ్లలోనే పదవి వదులుకోవాల్సి రావచ్చని ఆయన అంచనా. ఈ తేడా అమెరికా విదేశాంగ విధానాల అనిశ్చితిని వివరిస్తుంది. మోదీ దీర్ఘకాలిక వ్యూహాలు భారత్‌ను గ్లోబల్ శక్తిగా నిలబెడుతున్నాయని వివరించారు.