Earth’s rotation : భూమి చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది నిరంతరం మారుతుంది. ఖగోళ శాస్త్రవేత్తలు భూమిని మూడ భాగాలుగా విభజించారు. భూ అంతర్భాగాన్ని భూపటలం(క్రసట్, భూప్రచారం(మాంటెల్), భూ కేంద్ర మండలం(కోర్)గా విభజించారు. అయితే, వీటిలో భూకేంద్ర మండలం స్వతంత్రంగా తిరుగుతున్నట్టు (భ్రమణం) పలు సిద్ధాంతాలు రుజువు చేశాయి. ప్రస్తుతం అంతర్గత భూకేంద్ర మండలం వేగం అనూహ్యంగా నెమ్మదించి, అపసవ్య దిశలో తిరుగుతున్నట్టు తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది.
సూర్యునితో సమానమైన వేడి..
భూ కేంద్ర మండలం అనేది భూమిలో అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంతో సమానంగా ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 5,180 కి.మీ. లోతులో ఉండే ఈ ప్రదేశం ఐరన్, నికెల్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇక లోపలి కోర్ చుట్టూ ద్రవ రూపంలో ఖనిజాల బాహ్య కోర్ ఉంటుంది. ఇది భూమికి మిగిలిన భాగాలతో ఒక అవరోధంగా పనిచేస్తుంది. ఈ అవరోధం వేడి లోహపు బంతిలా ఉంటుంది. మనం నివసించే భూమి బయట పొరను భూపటలం అంటారు. ఈ పొర 30 నుంచి 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొరపై అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్.
1936లో గుర్తింపు..
ఇక భూ అంతర్గత భాగాన్ని డెన్‌మార్క్‌కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త ఇంజే లెహ్‌మాన్ 1936లో గుర్తించారు. నాటి నుంచి భూ కేంద్ర మండలం భ్రమణ వేగం, తిరిగే దిశపై చర్చ జరుగుతూనే ఉంది. దీనికి కారణం తమ అభిప్రాయాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలకు ఆధారాలు ఉండటమే. భూ అంతర్గత నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించడం లేదా సేకరించడం అసాధ్యం. అనేక పరిశోధనలు, అధ్యయనాలు కోర్‌గుండా వెళ్లూ సారూప్య బలాల తరంగాల మధ్య వైవిధ్యాలపై ఆధారపడి ఉంటాయి.
క్షీణిస్తున్న భ్రమణ వేగం..
ఇక భూమిపై పదేపదే భూకంపాలు, పేలుళ్ల సమయంలో సిస్మోగ్రాఫ్ డేటా విశ్లేషణ ద్వారా కొన్ని సంవత్సరాలుగా భూమి ఉపరితలంతో పోలిస్తే అంతర్గత కోర్ భ్రమణ వేగం క్షీణిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు జూన్‌లో నేచర్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయన ఫలితాల్లో పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధన భూ భ్రమణ వేగాన్ని ధ్రువీకరించడమే కాకుండా.. కోర్ క్షీణత కొన్ని దశాబ్దాలుగా మందగించినట్టు 2023లో శాస్త్రవేత్తల చేసిన వాదనను బలపరుస్తోంది. గతేడాది ప్రతిపాదించిన మోడల్ భూమి కోర్ భ్రమణ వేగం.. దిశను వివరించింది. ఇందులో భూమి క్రస్ట్ వేగంగా తిరుగుతుందని, కానీ ఇప్పుడు నెమ్మదిగా తిరుగుతోందని ఆ మోడల్ పేర్కొంది. కొంతకాలం కోర్, భూమి భ్రమణం సరిపోలాయి. తరువాత కోర్ భ్రమణ వేగం రివర్స్ దిశలో కదలడం ప్రారంభించిన తర్వాత మరింత తగ్గిందని తెలిపింది.