China : భారీ శిలలతో ఉన్న పర్వతాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇలా ఒక్కో పర్వతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా పర్వతాలపై పువ్వులు వంటివి ఉంటాయి. కానీ చైనాలోని ఓ పర్వతం గుడ్లు పెడుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా మీరు విన్నది నిజమే. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని చాన్ ద యా పర్వతంపై రాళ్లు గుడ్లు పెడతాయి. అందుకే ఈ పర్వతాన్ని గుడ్లు పెట్టే పర్వతం అని అంటారు. రోజురోజుకీ ఈ పర్వతం కూడా పెరుగుతోందట. దాదాపు 660 పౌండ్ల బరువున్న పెద్ద, గుండ్రని రాళ్లను ఈ పర్వతం ఉత్పత్తి చేస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ రాతి గుడ్లు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి కొండపై పుడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గులు జాయ్ అనే గ్రామానికి దగ్గరగా ఈ పర్వతం ఉంది. ఇది చాలా చిన్న పర్వతమైన రాతి గుడ్లను పెడుతోంది. ఈ రాతి గుడ్డు సైజు 20 నుంచి 60 సెంటీమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడి ప్రజలు వీటిని అదృష్టంగా భావించి పూజిస్తారట.
రాతి గుడ్లు అన్ని కూడా ఒకే సైజ్‌లో ఉంటున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇవి ముదురు నీలం రంగు ఉండటంతో పాటు పాలిష్ చేసినట్లు ఉంటాయి. సూర్యరశ్మి తగిలితే బాగా మెరుస్తున్నాయి. గులు గ్రామం ఒక పురాతన ప్రాంతం. ఇక్కడ దాదాపుగా 2,50,000 మంది జనాభా నివసించేవారట. కానీ ప్రస్తుతం చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా షుయ్ జాతికి చెందిన వారు. చైనాలోని 56 జాతి మైనారిటీలలో షుయ్ ఒకరు. ఈ ప్రాంతం చాలా విశాలంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతీ కుటుంబంలో ఈ గుడ్డు ఉంటుంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఈ రాతి గుడ్లు ఎలా పుడుతున్నాయనే విషయం ఇంకా శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. అయితే ఈ గుడ్లు కేంబ్రియన్ కాలం నాటివని గుర్తించారు. దాదాపు 500 మిలియన్ సంవత్సరాల క్రితంవి ఈ గుడ్లు అయి ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఎలా వస్తున్నాయనే విషయంపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.
చాన్ ద యా పర్వతం వెనుక చైనాలో ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయట. రాతి గుడ్లు ఇలా వస్తే అవి తమకు అదృష్టాన్ని, రక్షణను తెస్తాయని షుయ్ ప్రజలు నమ్ముతారు. అంటే ఇవి దేవతల నుంచి వచ్చిన కానుకలు అని చెబుతుంటారు. ఇవి దుష్టశక్తులు ఇంటికి రాకుండా కాపాడతాయని నమ్ముతారు. అయితే ఇలా పర్వతంపై రాళ్లు పుట్టుకొస్తున్న కొలది పర్వతం సైజు తగ్గుతుందట. అంటే రాబోయే కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈ పర్వతం మట్టిలో కలిసిపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి రాతి గుడ్లు ఇంకా పెరుగుతాయా? లేకపోతే ఈ పర్వతం నేలమట్టం అవుతుందా? అనేది చూడాలి.