China: చంద్రుడికి అవతలి వైపు చైనా చాంగే -6.. ఈ ప్రయోగంతో డ్రాగన్ ఏం చేయబోతోందంటే..

చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే -6 పేరుతో లూనార్ ల్యాండర్ ను జాబిల్లిపై ల్యాండ్ చేసింది. ఆ లూనార్ ల్యాండర్ చంద్రుడి వద్ద ఉన్న అయిట్కిన్ బేసిస్ ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 3, 2024 2:35 pm

China

Follow us on

China: తన ప్రయోజనాల కోసం చైనా ఏదైనా చేస్తుంది. తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. సరిహద్దుల నుంచి నింగి దాకా చైనాది ఇదే పాలసీ. ఆ మధ్య మనం చంద్రయాన్ ప్రయోగం చేస్తే.. చైనా కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. యావత్ ప్రపంచం మన ప్రయోగాన్ని వెయ్యినోళ్ల పొగిడితే.. అది మాత్రం సన్నాయి నొక్కులు నొక్కింది. మన ప్రయోగం ద్వారా చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు, హీలియం, నిల్వలు ఉన్నట్టు బయట ప్రపంచానికి తెలిశాయి. మన ప్రయోగాల ద్వారా చంద్రుడి గుట్టుమట్లు వెలుగులోకి రావడంతో.. ఉన్నట్టుండి చైనా ప్రయోగానికి సిద్ధమైంది. దానికి చాంగే – 6 అనే పేరు పెట్టింది. అది భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జాబిల్లి అవతల ల్యాండ్ చేసింది. ఇంతకీ ఈ ప్రయోగం చైనా ఎందుకు చేసిందంటే.

చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే -6 పేరుతో లూనార్ ల్యాండర్ ను జాబిల్లిపై ల్యాండ్ చేసింది. ఆ లూనార్ ల్యాండర్ చంద్రుడి వద్ద ఉన్న అయిట్కిన్ బేసిస్ ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకింది. చైనా ఇప్పటివరకు సాధించిన అంతరిక్ష ప్రయోగాలలో ఇదే అత్యంత ఆధునికమైనది. జాబిల్లికి అవతల వైపున ఆ లూనార్ ల్యాండర్ రెండు కిలోల వరకు మట్టిని సేకరించి, తిరిగి భూమిని చేరుకుంటుంది.

చైనా 2019లో చాంగే -4 పేరుతో చంద్రుడి అవతలి వైపుకు లూనార్ ల్యాండర్ ను ప్రయోగించింది. ఇక తాజాగా పంపిన చాంగే -6 లోనూ ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీ ఎంట్రీ మాడ్యూల్ అనే నాలుగు పరికరాలను అమర్చింది. చాంగ్ -6 మే నెల మూడవ తేదీన ఆకాశంలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. 53 రోజులపాటు సుదీర్ఘ ప్రయాణం సాగించింది. అనంతరం జాబిల్లిని చేరుకొంది. అక్కడ రోబోల సహాయంతో తవ్వకాలు జరిపి, రెండు కిలోల వరకు మట్టిని తీసుకొస్తుంది. దీనికోసం 14 గంటల పాటు ఆ రోబోలు శ్రమిస్తాయి. మట్టి తవ్వకం తర్వాత మాడ్యూల్ చందమామ ఉపరితలం వైపుకు వెళుతుంది. చంద్రుడి కక్ష్య లో ఉన్న ఆర్బిటర్ తో అనుసంధానం అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఆ శాంపిళ్లు ఆర్బిటర్ లోని రీ ఎంట్రీ మాడ్యూల్ లోకి ప్రవేశిస్తాయి. అనంతరం ఆర్బిటర్ భూమి దిశగా ప్రయాణాన్ని సాగిస్తుంది. భూమిని చేరుకున్న తర్వాత రీ ఎంట్రీ మాడ్యూల్ ఆర్బిటర్ నుంచి వేరవుతుంది. అది చైనాలోని మంగోలియా ప్రాంతంలో భూ వాతావరణంలోకి ఎంట్రీ ఇస్తుంది.

చాంగే -6 ద్వారా కమ్యూనికేషన్లను కొనసాగించేందుకు ప్రత్యేక శాటిలైట్ ను చైనా చంద్రుడి కక్ష్య లోకి పంపించింది. ఈ ప్రయోగం సఫలీకృతం కావడంతో 2030 న ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. జాబిల్లికి సంబంధించి మనకు అత్యంత ప్రకాశవంతంగా కనిపించే ఇవతలి భాగం నుంచి డ్రాగన్ పలు రకాల నమూనాలు సేకరించి, భూమ్మీదకు అత్యంత సురక్షితంగా తీసుకొచ్చింది. చంద్రుడికి సంబంధించి మనకు కనిపించని అవతల భాగం అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఆ ప్రాంతంలోని జాబిల్లి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఉంటుంది. చాంగ్ -6 ప్రయోగం ద్వారా చంద్రుడి అవతలి భాగంలోని వాతావరణం, అక్కడ ఉన్న శిలలు, దుమ్ము ధూళి, ఇతర పదార్థాల గురించి చైనా సరికొత్త విషయాలను వెల్లడించనుంది. మరోవైపు చంద్రుడికి సంబంధించిన రెండు భాగాలు పూర్తి భిన్నమని ఇటీవల రిమోట్ సెన్సింగ్ పరిశీలనలో వెల్లడైంది. జాబిల్లికి సంబంధించి ఇవతలి భాగం చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతం దుర్భేద్యంగా ఉంటుంది. అంతరిక్ష శిలలు ఢీకొనడంతో ఆ ప్రాంతం మొత్తం బిలాలతో నిండిపోయింది.. అంతేకాదు చంద్రుడి ఉపరితల మందం కూడా భిన్న రీతుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.