Homeఅంతర్జాతీయంChina CCTV Iran hacking: చైనా సీసీ కెమెరాలు ఇరాన్ చావుకు కారణం.. ఇజ్రాయిల్ హ్యాకింగ్...

China CCTV Iran hacking: చైనా సీసీ కెమెరాలు ఇరాన్ చావుకు కారణం.. ఇజ్రాయిల్ హ్యాకింగ్ వ్యూహం సక్సెస్

China CCTV Iran hacking: పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. చర్చలకు ఇరాన్‌ ససేమిరా అంటోంది. శత్రువును ఓడించే దాకా పోరాడతామంటోంది. మరోవైపు నెలరోజులు దాటినా యుద్ధం ముగియడం లేదు. అమెరికా ఆర్థికంగా నష్టపోతోంది. వారం రోజుల్లో యుద్ధం ముగించొచ్చు అని భావించిన ట్రంప్‌ అంచనాలు తలకిందులయ్యాయి. యుద్ధం మొదలైన మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా–ఇజ్రాయెల్‌ సేనలు మట్టుపెట్టాయి. బ్లూ స్పారో వ్యూహంతో ఖమేనీ ఉన్న భవనంపై దాడి చేశాయి. ఇక తర్వాత ఇరాన్‌ ప్రభుత్వంలోని మంత్రులు, సైనిక, ఎయిర్‌ఫోర్స్, నేవీ ఫోర్స్‌ అధికారులను ఇజ్రాయెల్‌ చంపేసింది. నెల రోజుల్లో సుమారు 30 మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందుకు అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రయోగించిన అత్యాధునిక సాంకేతికత ఉంది. కేవలం గూఢచార సమాచారం మాత్రమే కాదు.. రోడ్లపై ఇరాన్‌ అమర్చిన చైనా సీసీ కెమెరాలు, ఏఆర్‌టెక్నాలజీ, డేటా మైనింగ్‌ కలగలిపిన ఒక భయంకరమైన వ్యూహం ఇందులో పనిచేసింది. ఇరాన్‌ తన సొంత నిఘా వ్యవస్థనే తనకు వ్యతిరేకంగా మార్చుకున్న తీరు, ఆ దేశానికి షాక్‌ ఇస్తోంది.

టెహ్రాన్‌ కెమెరాలే అమెరికా కళ్లు
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని దాదాపు అన్ని ట్రాఫిక్‌ కెమెరాలను ఇజ్రాయెల్‌ మొసాద్‌ సంస్థ ఏళ్ల తరబడి హ్యాక్‌ చేసి ఉంచినట్లు తాజా విచారణలో వెల్లడైంది. ఇరాన్‌ రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చైనాకు చెందినవి. ఇవి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయి. వీటిని ఇజ్రాయెల్‌ సైబర్‌ నిపుణులు హ్యాక్‌ చేసి, ఆ ఫుటేజీలను టెల్‌ అవీవ్‌లోని సర్వర్లకు ఎన్‌క్రిప్ట్‌ చేసి పంపించేలా మార్చారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజానీ, ఐఆర్‌జీసీ కమాండర్ల కదలికలను ఈ కెమెరాల ద్వారా ఇజ్రాయెల్‌ 24/7 గమనించింది. కేవలం నేతలను మాత్రమే కాదు, వారి బాడీగార్డ్ల కదలికలను కూడా ట్రాక్‌ చేశారు. వారి రూటీన్, ప్రయాణ మార్గాలు, సమావేశ స్థలాలను గుర్తించారు.

ఏఐ సహాయంతో టార్గెట్‌..
హ్యాక్‌ చేసిన కెమెరాల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను వినియోగించాయి. అమెరికా సైన్యం ’ఆంథ్రోపిక్‌ క్లాడ్‌’ అనే ఏఐ టూల్‌ను ఉపయోగించి, ఇరాన్‌లోని 30కి పైగా స్థావరాలపై దాడులకు ప్లాన్‌ చేసింది. ఈ ఏఐ నిఘా అంచనాలు, టార్గెట్‌ గుర్తింపు, యుద్ధ దృశ్యాలను అనుకరించడంలో కీలక పాత్ర పోషించింది. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) యూనిట్‌ 8,200, బిలియన్ల డేటా పాయింట్లను ఫిల్టర్‌ చేయడానికి ’సోషల్‌ నెట్‌వర్క్‌ అనాలిసిస్‌’ అనే గణిత పద్ధతిని వాడింది. దీనివల్ల నిర్ణయం తీసుకునే కేంద్రాలు, కొత్త లక్ష్యాలు గుర్తించబడ్డాయి. దాడి జరిగిన రోజు ఉదయం, ఖమేనీ, ఇతర సీనియర్‌ అధికారులు ఒకే చోట సమావేశమవుతున్నారని ఈ ఏఐ వ్యవస్థ లైవ్‌గా నిర్ధారించింది. దీంతో అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

30 మంది కీలక నేతలు హతం..
ఈ సాంకేతిక ఆధారిత దాడుల్లో ఇరాన్‌ అత్యున్నత నేతలు ఒక్కొక్కరుగా హతమయ్యారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఫిబ్రవరి 28 దాడిలో మృతి చెందాడు. అలీ లారిజానీ ఇరాన్‌ సెక్యూరిటీ చీఫ్, ఖమేనీకి కుడిభుజం.గోలమ్‌రెజా సోలేమానీ ఐఆర్‌జీసీ బసిజ్‌ పారామిలటరీ దళం కమాండర్‌. అలీ మొహమ్మద్‌ నైనీ ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి. ఇలా మొత్తం 30 మంది కీలక సైనిక, రాజకీయ నేతలు ప్రాణాలు కోల్పోయారు. సొంత కెమెరా నుంచే శత్రువులకు సమాచారం అందింది. ఈ విషయం తెలిసి ఇరాన్‌ షాక్‌కు గురైంది. తాను ప్రజలను నిఘా పెట్టడానికి, ప్రతిపక్షాలను అణచివేయడానికి ఏర్పాటు చేసిన కెమెరాలే ఇప్పుడు తన నేతల ప్రాణాలు తీశాయని గుర్తించింది.

చైనా మాల్‌ అంతే మరి..
చైనా కెమెరాలలోని సాఫ్ట్‌వేర్‌ లోపాలను ఇజ్రాయెల్‌ వాడుకుంది. ఇరాన్‌ సైబర్‌ భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. చైనా కెమెరాల్లో సైబర్‌ భద్రతా వైఫల్యం ఉంది. ఇప్పటికే ఇరాన్‌ ఆయుధాలు విఫలమయ్యాయి. రష్యా నుంచి వస్తున్న ఆయుధాలో కొంత ఉపయోగపడుతున్నాయి. ఇరాన్‌ ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్‌ అవుతున్నాయి. తాజాగా ఇరాన్‌ టాప్‌ లీడర్ల మృతికి పరోక్షంగా చైనా సీసీ కెమెరాలు ఉపయోగపడ్డాయి. ఇరాన్‌ ఇప్పుడు గూగుల్, ఐబీఎం, ఇతర ఐటీ కంపెనీలు, బ్యాంకులను టార్గెట్‌ చేస్తామని హెచ్చరించింది. ఇవి ఇజ్రాయెల్‌కు సాంకేతిక సాయం చేశాయని ఆరోపించింది.

ఇరాన్‌ నేతల హత్యలు కేవలం సైనిక విజయం కాదు. సాంకేతిక, సైబర్‌ యుద్ధంలో అమెరికా–ఇజ్రాయెల్‌ సాధించిన ఘన విజయం. రోడ్లపై ఉన్న సీసీ కెమెరాలు, ఏఐ అల్గారిథమ్‌లు కలగలిపి ఒక అదృశ్యమైన, తప్పించుకోలేని మృత్యువును సృష్టించాయి. ఇరాన్‌ ఈ షాక్‌ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. భవిష్యత్‌ యుద్ధాల్లో సాంకేతికతే నిర్ణయాత్మక అంశం అని ఇది నిరూపించింది.

 

 

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version