Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకాలు (టారిఫ్‌లు) విధించడం ద్వారా రష్యా చమురు దిగుమతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను పరోక్షంగా సహాయపడుతోందని భారత్‌పై ఆరోపణ చేశారు. ఈ క్రమంలోనే మొదట 25% టారిఫ్‌ను ప్రకటించిన ట్రంప్, రష్యా చమురు కొనుగోలును కొనసాగించడంపై మరో 25% జోడించారు. భారత్ రష్యా నుంచి రోజుకు సుమారు 1.75 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేస్తోంది, ఇది దేశ శక్తి భద్రతకు కీలకం. ఈ టారిఫ్‌లు టెక్స్‌టైల్స్, ఆభరణాలు, ఆటో పార్ట్స్ వంటి రంగాలపై ప్రభావం చూపుతాయి, భారత ఎగుమతులు 40–50 శాతానికి తగ్గవచ్చని నిపుణులు అంచనా.
భారత్ స్థిరత్వం..
అయితే భారత్ ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా తన విదేశాంగ విధానాన్ని స్థిరంగా ఉంచింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సభ్యత్వం కొనసాగిస్తామని, రష్యా చమురు దిగుమతులు ఆపవద్దని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ‘మేడ్ ఇన్ ఇండియా‘ ఉత్పత్తులపై దృష్టి సారించి, ఆభారాలు భరిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత్ ఆర్థిక లాభాలను కాపాడుతుంది, ఎందుకంటే రష్యా చమురు డిస్కౌంట్‌తో బిలియన్ల డాలర్లు ఆదా అవుతున్నాయి. అయితే, టారిఫ్‌లు జీడీపీ పెరుగుదలను 0.3–1% తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ దేశాలతో సహకారాన్ని పెంచుకుంటూ, చైనా ప్రభావాన్ని అడ్డుకోవడంలో తన స్థానాన్ని బలోపేతం చేస్తోంది.
భారత్‌కు అంతర్జాతీయ మద్దతు..
ఇలాంటి తరుణంలో ట్రంప్ చర్యలు అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. జర్మన్ విదేశాంగ మంత్రి భారత్‌ను చైనా దూకుడును అడ్డుకోవడంలో కీలక దేశంగా పేర్కొంటూ, ‘ఏషియా అంటే ఇండియా‘ అని వ్యాఖ్యానించారు. ఫిన్‌లాండ్ మంత్రి భారత్‌తో ‘సహకార పూర్వకం, గౌరవప్రదంగా‘ ఉండాలని సూచించారు. ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ భారత్‌ను దూరం చేసుకోవడం తప్పు అని, అమెరికా రక్షణ రంగ నిపుణులు కూడా భారత్‌ను కోల్పోవద్దని హెచ్చరించారు. ఫ్రాన్స్, యూకే వంటి యూరోపియన్ దేశాలు భారత్‌కు ఆయుధాలు (రఫేల్æ విమానాలు) సరఫరా చేస్తూ మద్దతు తెలుపుతున్నాయి. ఈ మద్దతు ట్రంప్ విధానాన్ని ప్రశ్నించి, భారత్‌ను ఇండో–పసిఫిక్ ప్రాంతంలో కీలక మిత్రుడిగా చూపిస్తోంది.
ట్రంప్ వైఖరి మార్పు..
ప్రెస్‌మీట్‌లో ట్రంప్ భారత్‌ను ‘గొప్ప దేశం‘ అని, మోదీతో తనకు మంచి సంబంధం ఉందని చెప్పారు. టారిఫ్‌లు మినహా భారత్‌పై కోపం లేదని, భారత్ అమెరికాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ మాటలు ట్రంప్ తన మొదటి దాడి నుంచి వెనక్కి తగ్గినట్టు సూచిస్తున్నాయి. పుతిన్, మోదీ, జిన్‌పింగ్ కలిసి దిగిన ఫోటో అమెరికాను కలవరపరిచింది, మేధావులు, ఆర్థికవేత్తలు భారత్‌ను కోల్పోవద్దని సలహా ఇచ్చారు. ట్రంప్ సలహాదారు ఓవర్డ్ లుట్విక్ మూడు షరతులు (మార్కెట్‌లు తెరవడం, బ్రిక్స్‌ను వదులడం, రష్యా చమురు ఆపడం) పాటిస్తే టారిఫ్‌లు ఎత్తుతామని చెప్పినా, ట్రంప్ స్వరం మారడం భారత్ వ్యూహాస్తిత్వానికి విజయం.
ప్రధాని మోదీ ట్రంప్ మాటలకు ఎక్స్‌లో స్పందించి, ధన్యవాదాలు చెప్పారు. అమెరికాతో సహకరించేందుకు సిద్ధమని, కానీ భారత ప్రయోజనాలను పణంగా పెట్టుకోమని స్పష్టం చేశారు. ఈ స్పందన భారత్‌లో రాజకీయంగా బలాన్ని చూపిస్తుంది, ఎందుకంటే రైతులు, చిన్న పరిశ్రమలు వంటి సున్నిత రంగాలను రక్షించడం కీలకం. మోదీ వ్యూహం ట్రంప్ ’అమెరికా ఫస్ట్’ విధానానికి సమతుల్యంగా ఉంటూ, బహుళ మిత్రత్వాన్ని ప్రోత్సహిస్తోంది.