https://oktelugu.com/

Vinesh Phogat: కల చెదిరింది.. రజతం దరిచేరకుంది.. వినేశ్ ఫొగాట్ కు షాక్ ఇచ్చిన కాస్

చివరికి మెడల్ వస్తుందని భావిస్తున్న సమయంలో.. కాస్ ఆమెకు నిరాశ కలిగించే తీర్పు వెల్లడించింది. గత సోమవారమే ప్యారిస్ స్పోర్ట్స్ విలేజ్ నుంచి వినేశ్ బయటికి వచ్చింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 14, 2024 / 10:31 PM IST

    Vinesh Phogat

    Follow us on

    Vinesh Phogat: కోట్లాది భారతీయుల ప్రార్ధనలు ఫలించలేదు. ఎంతగానో ఎదురుచూస్తున్న రజతం దరిచేరలేదు. తీర్పు అనుకూలంగా వస్తుంది, భారత్ ఖాతాలో మరో మెడల్ చేరుతుంది అనుకుంటున్న తరుణంలో.. కాస్( court of arbitration for sports) కోలు కోలేని షాక్ ఇచ్చింది. కోట్లాదిమంది భారతీయులు దిగ్భ్రాంతి కి గురయ్యే తీర్పును వెలువరించింది. మొత్తానికి వినేశ్ ఫొగాట్ కు మరింత నిరాశ మిగిల్చుతూ.. ఆమెపై వేటు వేయడం సరైన చర్య అంటూ సమర్ధించింది. దీంతో కోట్లాది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి. అటు వినేశ్ అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి.

    మహిళల 50 కిలో ప్రీ స్టైల్ విభాగంలో వినేశ్ అద్భుతమైన ప్రదర్శన చేపట్టింది. 50 కిలోల విభాగంలో ఫైనల్ దాకా వెళ్ళింది. కచ్చితంగా రజతం సాధిస్తానని ధీమాగా ఉంది. కాని చివరి నిమిషంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉండటంతో నిర్వాహకుల చేతిలో అనర్హతకు గురైంది. వాస్తవానికి ప్రపంచ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం అనర్హత వేటుపడిన రెజ్లర్లు ఫైనల్ పోటీలకు చేరినప్పటికీ.. చివరి ర్యాంకు మాత్రమే ఇస్తారు. అందువల్ల వినేశ్ కు కూడా చివరి ర్యాంకు మాత్రమే దక్కింది. ఎటువంటి మెడల్ ఆమె సొంతం కాలేదు. అయితే ఈ అనర్హత వేటను సవాల్ చేస్తూ ఆమె కాస్ ను ఆశ్రయించింది. ఈ కేసులో వాదనలు ఇటీవలే పూర్తయ్యాయి. వాస్తవానికి ఇటీవల తీర్పు వెల్లడి కావలసి ఉంది.. అయితే అనూహ్యంగా ఆ తీర్పును మరోసారి వాయిదా వేస్తూ కాస్ నిర్ణయం తీసుకుంది. అయితే బుధవారం తుది తీర్పును వెల్లడించింది.. వినేశ్ డిస్ క్వాలిఫై సరైనదని సమర్థించింది. దీంతో భారత్ కు మెడల్ దక్కలేదు.

    వాస్తవానికి పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో కుస్తీ పోటీల విభాగంలో వినేశ్ అద్భుతమైన ప్రతిభ చూపించింది. వరల్డ్ నెంబర్వన్ సుసాకి ని ఓడించింది. ఉక్రెయిన్ రెజ్లర్ లి వాచ్ పై పై చేయి సాధించింది. సెమి ఫైనల్లో క్యూబా రెగ్యులర్ గుల్మాన్ పై విజయం సాధించి ఫైనల్ దాకా వెళ్ళింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఫైనల్ లో ఆమె అమెరికా రెజ్లర్ సారా తో పోటీ పడాల్సి ఉండేది. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఆమె 100 గ్రాముల అదనపు బరువు కలిగి ఉంది. దీంతో నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు విధించారు. ఈ బరువు తగ్గడానికి వినేశ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. వాస్తవానికి పారిస్ ఒలంపిక్స్ లో తొలి మ్యాచ్ ఆడేటప్పుడు వినేశ్ 49 కిలోల బరువు మాత్రమే ఉండేది. అదే బరువును ఆమె సెమీఫైనల్ దాకా కొనసాగించింది. అయితే ఒకేరోజు మూడు మ్యాచ్ లు ఉండడంతో శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు ఆహారం ఎక్కువగా తీసుకుంది. దీంతో ఆమె రెండు కిలోల బరువు పెరిగింది. పారిస్ ఒలంపిక్స్ లో మిగతా రెజ్లర్లతో పోల్చితే.. వినేశ్ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. అయితే తన బరువును తగ్గించుకునేందుకు వినేశ్ తన శరీరాన్ని తీవ్రంగా కష్టపెట్టుకుంది. జుట్టు కత్తిరించుకుంది. దేహం నుంచి రక్తాన్ని తొలగించుకుంది . రాత్రిపూట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. జాగింగ్ చేసింది. స్కిప్పింగ్ కూడా చేసింది. ఇంత చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి మెడల్ వస్తుందని భావిస్తున్న సమయంలో.. కాస్ ఆమెకు నిరాశ కలిగించే తీర్పు వెల్లడించింది. గత సోమవారమే ప్యారిస్ స్పోర్ట్స్ విలేజ్ నుంచి వినేశ్ బయటికి వచ్చింది. అయితే ఆమె ఇంతవరకు ఇండియా చేరుకోలేదు.