Bonuses To Employees: ఉద్యోగులకు జీతాలు ఇలా ఎగ్గొట్టాలా.. వారికి లభించే ప్రయోజనాలను ఎలా అడ్డుకోవాలా.. అని చూసే యజమాన్యాలే నేటి కాలంలో ఎక్కువ. ఐటీ నుంచి మొదలు పెడితే ఆటోమొబైల్ వరకు అన్ని విభాగాలలో ఇదే పరిస్థితి.. ఇటువంటి చోట ఉద్యోగులను సొంత బిడ్డల్లా చూసుకుని.. ఏకంగా 2000 కోట్ల రూపాయలను బోనస్ గా కేటాయించాడు ఓ సీఈవో. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి మొత్తం అతని మీద పడింది.. ఇంతకీ అతడు ఎవరు? ఎందుకు ఇంతటి ఉదారత చూపించాడు? ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికాలో విలాసవంతమైన ప్రాంతాలలో ఒకటి లుసియానా. ఇక్కడ ఐటీ నుంచి మొదలు పెడితే లాజిస్టిక్ వరకు అన్ని విభాగాల కార్యకలాపాలు విస్తృతంగా సాగుతుంటాయి. లూసియానా కేంద్రంగా ఫైబర్ బాండ్(Fibre Bond) అనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కంపెనీకి సీఈవోగా గ్రాహం వాకర్ ఉన్నాడు. ఇతడు తన తండ్రి ఏర్పాటుచేసిన ఈ కంపెనీ ని 1.7 బిలియన్ డాలర్లకు అమ్మేడు. ఈ వ్యవహారానికి ముందే తన సంస్థను కొనుగోలు చేసిన ఈటన్ కంపెనీకి ఒక షరతు విధించాడు. తన కంపెనీ విలువలో 15% వాటా(దాదాపు 2000 కోట్లు) వాటా ను సాగుతున్న 540 మంది ఉద్యోగులకు కేటాయించాలని చెప్పాడు. దానికి ఈటన్ అంగీకరించింది. ఈ మేరకు వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో 540 మంది ఉద్యోగులకు ప్రతి ఏడాది ఒక్కొక్కరికి నాలుగు కోట్ల మేర నగదు లభిస్తుంది. అయితే ఇప్పటికే ఆ ఉద్యోగుల ఖాతాల్లో ఆ నగదు జమ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త యాజమాన్యం ఆధీనంలో పనిచేస్తున్న ఆ ఉద్యోగులు.. ఇంకా దీర్ఘ అదే ఉద్యోగంలో కొనసాగితే ఇంకా భారీగా నగదు లభిస్తుందని తెలుస్తోంది.
అమెరికా మీడియాలో ఈ వార్త ముందుగా ప్రసారమైతే ఎవరూ పెద్దగా నమ్మలేదు. పైగా ఇదంతా అబద్ధమని కొట్టి పారేశారు. కానీ ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సీఈవో వాకర్ ను అభినందనలతో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా మాకోసం నడిచి వచ్చిన ఏసుక్రీస్తు అంటూ కొనియాడుతున్నారు. “ఇదంతా నిజమని మేము ఇప్పటికీ అనుకోవడం లేదు. బ్యాంకు ఎకౌంటు చెక్ చేసుకుంటూ.. అందులో ఉన్న నగదు చూసుకుంటూ మురిసిపోతున్నాం. ఇదంతా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇలా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటాం. గృహాలు కొనుగోలు చేస్తాం. మాకంటూ కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటామని” ఫైబర్ బాండ్ సంస్థలో పనిచేసిన ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సంస్థను వాకర్ తండ్రి క్లాడ్ 1982లో ఏర్పాటు చేశారు. ఇక డిసెంబర్ 31న సీఈవో పదవి నుంచి వాకర్ దిగిపోతారు. దీనికి సంబంధించిన వార్త ఇంటర్నేషనల్ మీడియాలో విపరీతమైన సర్కులేషన్ లో ఉంది.. దీనిని క్రిస్మస్ సందర్భంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏసుక్రీస్తు ఇచ్చిన అవకాశం అని నెటిజన్లు పేర్కొంటున్నారు.