Bangladesh protests: బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగడం లేదు. చివరికి గత ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయినప్పటికీ అల్లర్లు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. షేక్ హసీనా భారత్ వెళ్లిపోయిన తర్వాత.. బ్రిటన్ కు శరణార్థిగా వెళ్లాలని చూశారు. ఆ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇంకా తన నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఇదే క్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అల్లర్లు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ ఆ దేశంలో అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. మన వైపు తాజాగా బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి ఆందోళనకారులు సర్వోన్నత న్యాయస్థానాన్ని టార్గెట్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు నినదించారు. ఇతర న్యాయమూర్తులు కూడా తమ పదవులను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిరసనలు చేపట్టారు. దీంతో ఆందోళనకారుల నిరసనలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిగివచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు.
ఆందోళనకారుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. న్యాయస్థానంలోని ఇతర న్యాయమూర్తుల తో అత్యవసరంగా సమావేశం కావాలని ఆయన భావించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి సమావేశానికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతించలేదని, ఆయన దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని వార్తలు వినిపించాయి. దీంతో నిరసనకారులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. పలువురు ఆందోళనకారుడు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని నిరసనలు చేపట్టారు. ఫలితంగా న్యాయమూర్తుల సమావేశం ఉన్నట్టుండి నిలిచిపోయింది. ఆందోళనకారులు మరో మెట్టు పైకెక్కి కోర్టును చుట్టుముట్టారు. గంటలో దిగిపోవాలని చీఫ్ జస్టిస్ కు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయన తన పదవి నుంచి వైదొలగక తప్పలేదు.
మహమ్మద్ యునస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బంగ్లాదేశ్లో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.. చీఫ్ జస్టిస్ రాజీనామాలు మర్చిపోకముందే బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ రవూఫ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఆందోళనకారులు కేంద్ర బ్యాంకు కార్యాలయం పైకి దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన బలగాలు నిరసనకారులను చెదరగొట్టాయి. ఇదే క్రమంలో బ్యాంకు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు రెండు సంవత్సరాల పదవి కాలం ఉండగానే రవూఫ్ రాజీనామా చేయడం విశేషం.
వీరిద్దరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది కీలక అధికారులు తన పదులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బంగ్లాదేశ్లో ఈ పరిణామాల వెనుక విదేశీ ప్రభుత్వాల హస్తం ఉందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కథనాలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పెద్దలు ఖండిస్తున్నారు.