Bangladesh former PM Sheikh Hasina: షేక్ హసీనా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. సొంత దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో ఆశ్రయం పొందతున్న నేత. రిజర్వేషన్ల విషయంలో అక్కడి యువత ఆగ్రహావేశాల కారణంగా హసీనా తన పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం వీడారు. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాపై అనేక అభియోగాలు మోపింది. విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రై మ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) సోమవారం వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా వివాదాలకు దారి తీసింది. 2024 ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆమె పాత్ర ఉందని కోర్టు నిర్ధారించిన కోర్టు.. షేక్ హసీనాతోపాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ను మరణశిక్ష విధించింది.
1,400 మంది మరణానికి కారణమని..
గతేడాది జూలై నుంచి ఆగస్టు మధ్య జరిగిన నిరసనల్లో 1,400 మంది మరణించినట్లు దర్యాప్తు నివేదికల్లో ప్రస్తావించబడింది. నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరపమని, హెలికాప్టర్లను వినియోగించమని హసీనా ఆదేశించారని న్యాయమూర్తి పేర్కొన్నారు. గాయపడిన వారికి వైద్య సహాయం నిరాకరించారని అభియోగం. ఈ చర్యలు మానవత్వానికి వ్యతిరేక నేరాలుగా పరిగణించబడ్డాయి. నేరం నిరూపితమైందని కోర్టు మరణ శిక్ష విధించింది.
దేశంలో హై అలర్ట్..
కోర్టు తీర్పు అనంతరం ఢాకా నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జాద్ అలీ అల్లర్లు, విధ్వంస చర్యలకు ప్రయత్నించే వారిని కాల్చివేయండి అంటూ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన నగరాల్లో సైనిక పహారా కాస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉన్నందున అంతర్జాతీయ దృష్టి మళ్లీ బంగ్లాదేశ్ వైపు చేరింది. ఇదిలా ఉంటే గత ఏడాది ఆగస్టు 5న రక్షణ దళాల విరోధంలో హసీనా దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో నివసిస్తూ అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అనుచరులకు సందేశాలు పంపుతున్నారు. తీర్పుకు ముందు ఆమె చేసిన ప్రసంగంలో ‘‘దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. నా ప్రాణం కోసం నేను కాదు, నా ప్రజల కోసం పనిచేస్తాను’’ అని తన రాజకీయ ద్రుఢత్వాన్ని తెలియజేశారు.
అవామీ లీగ్ కొలాప్స్..
షేక్ హసీనాకు మరణ శిక్ష నేపథ్యంలో ఆమె పార్టీ అవామీ లీగ్‌లో తీవ్ర అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటోంది. నాయకత్వం లేకుండా పార్టీ భవిష్యత్తు అనిశ్చితిలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షం దీనిని ప్రజా న్యాయంగా వ్యాఖ్యానిస్తోంది.
హసీనా శిక్షపై తీర్పు కేవలం ఒక రాజకీయ నాయకురాలికి సంబంధించినది కాదు.. ఇది బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న నైతిక, న్యాయ పరీక్ష. ఆమె ప్రవాసంలో ఉన్నా, దేశ భవిష్యత్తుపై ఆమె ప్రభావం ఇంకా ఉందని ఈ పరిణామం స్పష్టంగా చెబుతోంది.