Bihar elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీఏ మరోసారి ఘన విజయం సాధించింది. అధికార పక్షం అంతటి విజయం వస్తుందని కూడా ఊహించి ఉండదు. నితీశ్‌కుమార్ మరోమారు సీఎం కాబోతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బిహార్ ఫలితాలు ఒక కొత్త చర్చకు తెరలేపాయి. ఓట్ల శాతం, సీట్ల విజయాల మధ్య యథార్థ సమతుల్యత కనిపించడం లేదు. ప్రజల ఓటు శక్తి ఏ దిశలో వెళ్లిందనే దానికంటే ఎన్నికల వ్యవస్థ ఎలా పని చేస్తోంది అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
అంకెల్లో అంతరాలు..
ఈ ఎన్నికల్లో బీజేపీ 26 శాతం ఓట్లు సాధించి 89 సీట్లు గెలిచింది. గెలుపు శాతం 36కు సమానం. జేడీయూ కేవలం 19 శాతం ఓట్లు పొందినా 85 సీట్లు సాధించింది. మరోవైపు ఆర్జేడీకి 23 శాతం ఓట్ల మద్దతు దక్కినా కేవలం 25 సీట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇది ఓటు శాతం ఎప్పుడూ సీట్ల విజయాన్ని ప్రతిబింబించలేదని స్పష్టంగా చూపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ కేవలం 4.97 శాతం ఓట్లు సాధించి 19 సీట్లు గెలుచుకుందంటే, ప్రాంతీయ స్థాయి వ్యూహాలు సంఖ్యలను ఎలా మలుస్తాయో అర్థమవుతుంది. కాంగ్రెస్ 8.71 శాతం ఓట్లు సాధించి కేవలం 6 సీట్లు పరిమితమవడం సిస్టంలో లోపాన్ని ఎత్తి చూపుతోంది.
ఎఫ్‌పీటీ వ్యవస్థలో అసమానత..
భారత ఎన్నికల విధానం ‘ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్’(ఎఫ్‌పీటీ) నమూనాపై ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి విజేతగా ప్రకటించబడతాడు. ఒక చోట 20 శాతం ఓట్లు పొందిన అభ్యర్థి గెలుచుకోగా, మరొకచోట 19 లేదా 18 శాతం ఓట్లు పొందిన అభ్యర్థులు ఓడిపోతారు. మొత్తం గణాంకాల్లో చూస్తే, ఓట్ల శాతం–సీట్ల శాతం మధ్య వ్యత్యాసం పెద్దగా ఉంటుంది.
ప్రాంతీయ ఓటు విభజన..
ఆర్జేడీ వంటి పార్టీలకు రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన ఓటు శాతం ఉన్నా, అది సమానంగా విస్తరించకపోవడం వెంటనే సీట్ల హక్కులో ప్రతిఫలించదు. పార్టీ మద్దతు కేంద్రీకృతమైన ప్రాంతాల్లో అధిక ఓట్లు కూడగట్టడం, మరికొన్నిచోట్ల తక్కువ తేడాతో ఓడిపోవడం అనే నిర్మాణాత్మక సమస్య సీట్ల సంఖ్యను తగ్గిస్తుంది.
ఈ గణాంకాలు ప్రజాభిప్రాయం ప్రతిబింబించడంలో నేటి ఎన్నికల వ్యవస్థ బలాలను, పరిమితులను తెరమీదకు తెచ్చాయి. ఓట్ల సమీకరణ ప్రజాభిలాషను ప్రతిబింబించాలంటే ప్రాతినిధ్య వ్యవస్థలో మరింత సమీక్ష అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.