Bahrain Political Crisis: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అల్లుకుంటున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై విధ్వంసకర దాడులు చేస్తున్నా, భూభాగాన్ని ఆక్రమించుకునే అవకాశం మాత్రం లేదు. వారి లక్ష్యం ఇరాన్‌ను ఆయుధరహిత దేశంగా మార్చడమే తప్ప, దాని భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు. ఈ శూన్యాన్ని అవకాశంగా మార్చుకుని, ఇరాన్ తన ప్రాంతీయ ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా బహ్రెయిన్ ఇప్పుడు ఈ భౌగోళిక రాజకీయాల కేంద్రబిందువుగా మారింది.
ఇరాన్ వ్యూహాత్మక అవకాశం..
అమెరికా–ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్నా, దాని ’అసిమెట్రిక్ వార్‌ఫేర్’ శక్తి మాత్రం అలాగే ఉంది. తమ భూభాగాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో, ఇరాన్ తన శక్తిని పక్క దేశాల్లోని షియా మైనారిటీలను రెచ్చగొట్టడంపై కేంద్రీకరిస్తోంది. సున్నీ ఆధిపత్యం ఉన్న గల్ఫ్ దేశాల్లో షియా వర్గాలను ఏకం చేసి, ప్రాక్సీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. స్థానిక అసంతృప్తిని జాతీయోద్యమంగా మార్చి, తిరుగుబాట్లకు నాయకత్వం వహించాలనుకుంటోంది. భౌతికంగా భూమిని ఆక్రమించకుండానే, ఆ దేశాలను తమ ప్రభావ వలయంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది.
బహ్రెయిన్‌లో మొదలైన తిరుగుబాటు..
గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన రాజకీయ సమీకరణాలను కలిగి ఉంది. ఇక్కడ జనాభా గణాంకాలే ప్రస్తుత సంక్షోభానికి మూలకారణం. బహ్రెయిన్‌లో 65 నుంచి 70 శాతం మంది షియా జనాభా ఉంది. సున్నీ ముస్లింలు కేవలం 30 నుంచి 35 శాతం. అయితే ఇక్కడి పాలకులు సున్నీలు అల్ ఖలీఫా కుటుంబం పాలిస్తోంది. ఇరాన్ ప్రోత్సాహంతో ఇప్పుడు 1783 నుంచి అధికారంలో ఉన్న సున్నీ పాలక కుటుంబంపై తిరుగబాటు చేస్తున్నారు. దీంతో బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా సౌదీ అరేబియాకు పారిపోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో సౌదీ సైన్యం వచ్చి బహ్రెయిన్‌ను కాపాడింది. కానీ, ప్రస్తుతం సౌదీ కూడా యెమెన్ యుద్ధం, ఇరాన్ ఒత్తిడితో సతమతమవుతోంది. మరోసారి సైన్యం పంపే పరిస్థితి లేదు.
ఇరాన్‌కు కీలకం..
బహ్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడం ఇరాన్‌కు లబ్ధి చేకూరుస్తుంది. బహ్రెయిన్‌లో ఇరాన్ ప్రభావం పెరిగితే, సౌదీ అరేబియా తూర్పు తీరం పూర్తిగా ఇరాన్ చుట్టుముట్టినట్లే. బహ్రెయిన్‌లోనే అమెరికా నావికాదళ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ అస్థిరత సృష్టించడం వల్ల అమెరికా సైనిక సామర్థ్యానికి భారీ దెబ్బ తగులుతుంది. బహ్రెయిన్‌లో షియా ప్రభుత్వం ఏర్పడితే, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈలలోని షియా మైనారిటీలు కూడా రెచ్చిపోతారు.
అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ఇరాన్‌ను బలహీనపరిచినా, అది తన ప్రాంతీయ విస్తరణవాదాన్ని ఆపేలా కనిపించడం లేదు. బహ్రెయిన్‌లోని జనాభా అసమానతను అస్త్రంగా మార్చుకుని, బహ్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటే, పశ్చిమాసియాలో శక్తి సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. సున్నీ–షియా విభజన తీవ్రమవుతుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రమాదం ఉంది.