https://oktelugu.com/

Australia: కెనడా బాటలో ఆస్ట్రేలియా.. విదేశీ విద్యార్థుల తగ్గిపునకు చర్యలు..

విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఏటా వేల మంది వెళ్తున్నారు. ఉన్నత చదువులు చదువుకోవడంతోపాటు అక్కడే ఉద్యోగాలు సాధించుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 29, 2024 / 09:17 AM IST

    Australia

    Follow us on

    Australia: భారత్‌లో ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన విదేశీ విద్య ఇప్పుడు మధ్య తరగతి వారికి చేరువైంది. బ్యాంకులు ఇస్తున్న విద్యా రుణాలు, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో మిడిల్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌ కూడా తమ డాలర్‌ డ్రీమ్స్‌ నెరవేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను విదేశాల్లో చదివించడం స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు. దీంతో అప్పులు చేసి అయినా తమ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటున్నారు. ఒక్కసారి సెట్‌ అయితే.. లైఫ్‌ టర్న్‌ అవుతుందన్న ఆశతో పేరెంట్స్‌ కూడా పిల్లలను విదేశాలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మన విద్యార్థులు ఎక్కువగా అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారు. ఏటా లక్ష మంది వరకు విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల కారణంగా వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా దేశాలు వలసలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా హెచ్‌–1బీ వీసాలను తగ్గించింది. కెనడా వలసవాదులను తమ దేశం నుంచి పంపిచేయాలని చూస్తోంది. ఇదే బాటలో ఇప్పుడు ఆస్ట్రేలియా పయనిస్తోంది.

    వలసలపై పరిమితి..
    అంతర్జాతీయ విద్యార్థులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్న ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కోవిడ్‌–19కు పూర్వస్థితికి వలసలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతిఏటా 2,70,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి యూనివర్సిటీకి నిర్ణీత కోటాను పెడతామని వెల్లడించింది. దీనివల్ల వృత్తి విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఆర్థిక విధ్వంసమని పలు యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 7,17,500 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.

    కోవిడ్‌ ముందు పరిస్థితి..
    కోవిడ్‌ సమయంలో ఉన్నత విద్యారంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్‌ క్లారి అంగీకరించారు. కోవిడ్‌ కాలంలో ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులందరినీ స్వదేశాలకు పంపించి వేసింది. ప్రస్తుతం కోవిడ్‌ పూర్వకాలంతో పోలిస్తే 10 శాతం మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధికంగా ఉన్నారు. వృత్తి విద్యా శిక్షణ సంస్థల్లో అయితే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 50 శాతం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వలసల కుదింపుపై దృష్టి పెట్టింది.

    విద్యార్థుల ముసుగులో వచ్చి..
    విద్యను చాలా యూనివర్సిటీలు వ్యాపారంగా మార్చాయని క్లోర్‌ ఆరోపించారు. నాణ్యత లేని విద్యను అందించడమే కాకుండా ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేని విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు గుర్తించామన్నారు. దీంతో చాలా మంది విద్యార్థుల ముసుగులో వచ్చి ఆస్ట్రేలియాలో పనులు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 2025 నుంచి ప్రభుత్వ యూనివర్సిటీల్లో 1,45,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని నిర్ణయించారు. ప్రైవేటు యూనివర్శిటీలలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 30 వేలకు పరిమితం చేస్తామన్నారు. వృత్తివిద్య శిక్షణ సంస్థల్లో 95 వేల మందికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు.