Modi Russia Visit: బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందకు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఉదయం రష్యా బయల్దేరి వెళ్లారు. సాయంత్రం రష్యాలోని కజాన్ చేరుకున్నారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఇద్దరు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 23వ తేదీన జరిగే బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సారథ్యం వహిస్తారు. ఇక ఈ సదస్సుకు కొత్తగా సభ్యత్వం పొందిన ఐదు దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చ..
ఇదిలా ఉంటే మోదీ పుతిన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రధాన అంశంగా మారింది. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనాలన్నదే భారత లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భేటీ అనంతరం ఇద్దరు నేతల ఆలింగనం ఫొటో విడుదల చేశారు. గత పర్యటనలోనూ ఇద్దరూ కరచాలనం, ఆలింగనం చేసుకున్న ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. ఉక్రెయిన్‌కు కోసం తెప్పించాయి. తాజా ఫొటోలపై ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
చైనాతో చర్చలు..
ఇక రష్యా పర్యటనలో మోదీ మరో సంచలనానికి తెరతీయబోతున్నారు. బ్రిక్స్ సమావేశం అనంతరం డ్రాగన్ కంట్రీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అవుతారని తెలుస్తోంది. బుధవారం(అక్టోబర్ 23న) ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని సమాచారం. ఈమేరకు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించాయి. ఐదేళ్ల తర్వాత చైనా, భారత్ దేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధ్రువీకరించారు. సరిహద్దు గస్తీకి సంబంధించి భారత్–చైనాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య తాజా భేటీ జరగనుండడం విశేషం. జిన్ పింగ్‌తోపాటు ఇతర దేశాల అధినేతలతోనూ మోదీ భేటీ అవుతారని తెలుస్తోంది.