America Temple: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పట్టుమని 40 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ప్రస్తుతం ఎన్నికల సందడి కనిపిస్తోంది. అంతటా ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు సర్వే సంస్థలు కూడా ఫలితాలు అంచనా వేసే పనిలో ఉన్నాయి. అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు పోలింగ్ కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో దుండగులు.. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై కాల్పులు జరపడం కలకలం రేపింది. రెండుసార్లు ట్రంప్‌పై, ఒకసారి కమలా హారిస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష అభ్యర్థులను టార్గెట్ చేయడం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలో హిందూ ఆలయాలపైనా దాడులు జరుగుతుఆన్నయి. తాజాగా కాలిఫోర్నియాలోని ఓ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. శాక్రమెంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరంపై హిందూస్ గో బ్యాక్ అంటూ నినాదాలు రాశారు. అక్కడా విధ్వంసం సృష్టించారు.
ఎన్నికల వేళ ఏమిటీ పరిణామం..
త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈతరుణంలో అగ్రరాజ్యంలో హిందూ ఆలయాలను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి దాడులు జరగడం కలకలం సృష్టించింది. సెప్టెంబర్ 17న న్యూయార్క్‌లోని స్వామి నారాయణ్ మందిర్ వద్ద కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దీనిని బాప్స్ ప్రజా వ్యవహారాల విభాగం ఖండించింది. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి నేరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలిపి పనిచేస్తామని తెలిపింది. తాజాగా కాలిఫోర్నియాలో దాడి జరగడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నీటి పైపులు ధ్వసం..
బుధవారం(పెప్టెంబర్ 26న) జరిగిన ఘటనతో ఆలయం అపవిత్రమైందని అక్కడి హిందువులు భావిస్తున్నారు. ఆలయానికి తాగునీరు సరఫరా చేసే పైపులను కూడా దుండగులు ధ్వంసం చేశారు. శాంతి ప్రార్థనలతో విద్వేషాలను ఎదుర్కొంటామని బాప్స్ ప్రతినిధులు తెలిపారు. వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలోని హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలపై దాడిని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఖండించింది.
సెనెటర్ల ఆందోళన..
అమెరికాలోని హిందూ ఆలయాలపై దాడులను అమెరికా సెనెటర్లు గతంలోనే ఖండించారు. వరుసగా దాడులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తప్పు పట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కానీ, దాడులు మాత్రం ఆగడం లేదు. కేవలం హిందూ ఆలయాలనే టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న దాడులు.. ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.