India’s cultural heritage : భారత దేశం.. విలువైన సంపదకు పుట్టినిల్లు. వందల ఏళ్ల క్రితమే మన దేశంపైకి దండెత్తి వచ్చిన రాజులు, నవాబులు, బ్రిటిషర్లు మన సంపదను కొల్లగొట్టారు. విలువైన వజ్రాలు, బంగారంతోపాటు అనేక వనరులను తరలించుకుపోయారు. అయితే కొందరు రాజులు మన సంస్కృతికి చిహ్నాలుగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. శిల్పాలు చెక్కించారు. వందల ఏళ్లనాటి ఆ నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక పాలకులు వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టారు. కానీ కొంతమంది స్మగ్లర్ల కారణంగా.. కొన్ని విలువైన కళాకృతులు అపహరణకు గురయ్యాయి. దేశం దాటిపోయాయి. అలాంటి వాటిలో కొన్ని అమెరికాకు చేరాయి. వాటి కోసం భారత్ జరిపిన సంప్రదింపులతో కొన్నింటిని తిరిగి అప్పగించింది.
1,400 కళాకృతులు..
భారత్ నుంచి స్మగ్లర్లు 1,400లకుపైగా విలువైన కళాకృతులను అపహరించుకుపోయారు. వీటి విలువ కోటి డాలర్లపైనే ఉంటుంది. దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలకు చెందిన కళాకృతులను మాతృదేశాలకు అప్పగించే చర్యల్లో భాగంగా అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు చెందిన 1,400 కళాకృతులను భారత్‌కు తిరిగి అప్పగించింది. మాతృ దేశాలకు కళాకృతులను అప్పగించే కార్యక్రమంలో భాగంగానే వీటిని అప్పగించామని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలంలోని యాంటిక్విటీ స్మగ్లింగ్ విభాగం తెలిపింది. ఇక భారత్ నుంచి అక్రమంగా లండన్‌కు తరలించిన దేవ నర్తకి శిల్పం వంటి అపురూప కళాకృతులు కూడా వీటిలో ఉన్నాయి. వీటిని ఇన్నాళ్లు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో భద్రపరిచారు.
స్మగ్లర్లను పట్టుకుని..
అమెరికా యాంటిక్విటీ విభాగం సిబ్బంది నాన్సీ వెయినర్ వంటి అమెరికా స్మగ్లర్లతోపాటు ఇండియాకు చెందిన పలువురు గ్యాంగ్ లీడర్లను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి 46 కోట్ల డాలర్ల విలువైన 5,800లకుపైగా కళాకృతులను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది స్మగ్లర్లకు శిక్ష కూడా విధించింది. తర్వాత వాటిని ఆయా దేశాలకు అప్పగించింది.