America: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. దేశంలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వేల మందిని గుర్తించి వారి దేశాలకు పంపించారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినం చేశారు. గ్రీన్ కార్డు(Green card) విషయంలోనూ నిబంధనలు మార్చారు. ట్రంప్ కార్డులు ప్రవేశపెట్టి విక్రయిస్తున్నారు.
Also Read: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: ‘ఎక్స్’ను అమ్మేసిన బిలియనీర్!
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ సంచలన నిర్ణయాలు, దూకుడైన పాలన తీరుతో ఇటు సొంత ప్రజలను, అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ఇప్పటికే అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని వారి దేశాలకు పంపిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్(Immigration)నిబంధనలు కఠినం చేశారు. హెచ్–1బీ వీసాల జారీని కఠినం చేశారు. తాజాగా అమెరికాలోని విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలని సూచిస్తూ ఈమెయిల్స్(e Mails)పంపినట్లు సమాచారం. కేవలం ఆందోళనల్లో చురుకుగా వ్యవహరించిన వారికే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలను లేదా జాతి వ్యతిరేక సందేశాలను పంచుకున్న విద్యార్థులకు కూడా ఈ హెచ్చరికలు వెళ్లాయి. ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు(India Students) కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చర్యలతో ఆన్‌లైన్ కార్యకలాపాలు,భావ ప్రకటనా స్వేచ్ఛపై పరిమితుల గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
జాతి వ్యతిరేక ప్రచారంలో పాల్గొంటే..
అమెరికా విదేశాంగ శాఖ జాతి వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న విద్యార్థుల సోషల్ మీడియాSocial Media) ఖాతాలను పరిశీలిస్తోంది. ఆరోపణలు నిజమని తేలితే, వారి వీసాలను రద్దు చేసి తక్షణమే స్వదేశాలకు పంపే ప్రణాళికలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై విదేశాంగ శాఖ మరియు కాన్సులేట్ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ అందుతున్నాయి.
ఈమెయిల్‌లో, ‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ మరియు జాతీయ చట్టం సెక్షన్ 221(జీ) ప్రకారం మీ వీసా రద్దు చేయబడింది. స్టూడెంట్ ఎక్సే్చంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అధికారులకు సమాచారం అందించాము. మీ కళాశాల యాజమాన్యానికి ఈ విషయం తెలియజేయబడవచ్చు‘ అని పేర్కొన్నారు.
అనుమతి లేకుండా ఉంటే..
అనుమతి లేకుండా దేశంలో ఉంటే నిర్భందం మరియు భవిష్యత్ వీసా అవకాశాలపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. స్వదేశానికి వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. ఈ నిర్ణయం విదేశీ విద్యార్థుల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. సోషల్ మీడియా వేదికలపై వారి కార్యకలాపాలు వీసా రద్దుకు దారితీస్తాయన్న ఆలోచన విద్యార్థి సముదాయంలో చర్చనీయాంశంగా మారింది. భారతీయ విద్యార్థులు కూడా ఈ హెచ్చరికల పరిధిలోకి వస్తే, దాని ప్రభావం వారి విద్య మరియు భవిష్యత్ ప్రణాళికలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.