Landing on the Moon : జాబిల్లి అంత ఈజీగా చిక్కలేదు.. అన్ని దేశాలదీ విఫల చరిత్రే!

అయితే ఆయా దేశాలు చేపట్టిన మిషన్లన్నీ తమ మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కాలేదు. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే...

Written By: Bhaskar, Updated On : August 24, 2023 9:13 pm
Follow us on

Landing on the Moon : చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమనౌకను పంపిన దేశాల సరసన భారత్‌ కూడా వచ్చి చేరింది. ఇప్పటివరకూ పూర్వపు సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా దేశాలు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాయి. అయితే ఏ వ్యోమనౌక ప్రయాణించని చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్‌ చేపట్టిన చంద్రయాన్‌-3 బుధవారం విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయింది. అయితే ఆయా దేశాలు చేపట్టిన మిషన్లన్నీ తమ మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కాలేదు. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌ తన ఆరో అంతరిక్ష యాత్రలో మాత్రమే చంద్రుడిని చేరుకోగలిగింది. సోవియట్‌ యూనియన్‌కు చెందిన లూనా-2 మిషన్‌ 1959 సెప్టెంబరు 14న చంద్రుడిపై కూలిపోయింది. మరో ఖగోళ వస్తువును తాకిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా చరిత్రలో నిలిచిపోయింది. అమెరికాకు చెందిన నాసా సైతం చంద్రయాత్రల్లో 13సార్లు విఫలమైన తర్వాత 1964 జూలై 31న తొలి విజయాన్ని నమోదు చేసింది. నానాకు చెందిన రేంజర్‌-7 చంద్రుడి ఉపరితలంపై కూలిపోయే ముందు 4,316 చిత్రాలను పంపడం కీలక మలుపుగా నిలిచింది.

చంద్రుడిపైకి ఆర్బిటర్‌ మిషన్లను ప్రారంభించిన చైనా..

చాంగే ప్రాజెక్టు ద్వారా జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి వీలుగా వివరణాత్మక పటాలను రూపొందించింది చైనా.. 2013 డిసెంబరు 2న, 2018 డిసెంబరు 7న ప్రయోగించిన చాంగే-3, చాంగే-4 మిషన్లు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి రోవర్లతో ఉపరితలాన్ని అన్వేషించాయి. 2020 నవంబరు 23న వెళ్లిన చాంగే-5.. చంద్రుడిపై నుంచి 2 కేజీల మట్టి నమూనాలతో తిరిగొచ్చింది.

మన దేశ మొదటి లూనార్‌ మిషన్‌ చంద్రయాన్‌-1 2008 అక్టోబరు 22న మొదలైంది. అప్పట్లో చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశపెట్టారు. ఈ వ్యోమనౌక జాబిల్లి చుట్టూ 3,400సార్లు కక్ష్యలో పరిభ్రమించింది. 2019 జూలై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించగా.. సాఫ్ట్‌వేర్‌ లోపాలతో అదే ఏడాది సెప్టెంబరు 6న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై కూలిపోయింది.

మైనస్‌ 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో..

భూమ్మీద ఒక పగలు 12 గంటలు. కానీ, చంద్రుడి మీద 14 రోజులు. అంటే 14 రోజులు పూర్తిగా వెలుగు. తర్వాత చీకటి. సోలార్‌ ప్యానెళ్ల ద్వారా శక్తిని పొందే విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై పడే సూర్యరశ్మితో పనిచేస్తాయి. అది ఆగిపోయాక చంద్రుడిపై చీకటి నెలకొని ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఈ వ్యవధిలో మనుగడ కష్టమే. అయితే, 14 రోజుల తర్వాత చంద్రుడిపై సూర్యోదయం అయ్యాక.. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ సూర్యరశ్మి పడి తిరిగి పనిచేయడం మొదలుపెడితే గొప్ప ప్రయోజనమని ఇస్రో చెబుతోంది.