https://oktelugu.com/

Brazil: నియంత్రణ కోల్పోయిన ఫ్లైట్‌.. 62 మంది ప్రయాణికులు.. చివరకు ఏమైందంటే?

నెల రోజుల క్రితం నేపాల్‌లో విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. అది మర్చిపోకముందే.. మరో దేశంలో మరో విమానం కుప్పకూలింది. ఇందులో 62 మంది మరణించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 10, 2024 / 09:18 AM IST

    Brazil

    Follow us on

    Brazil: బ్రెజిల్‌ : బ్రెజిల్‌లోని సావో పాలో సమీపంలో ఘోరప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారందరూ దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు క్రాష్ సైట్ సమీపంలోని స్థానిక అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏటీఆర్-నిర్మిత విమానం నియంత్రణ లేకుండా గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్టుగా కనిపించింది. ఇళ్లకు సమీపంలో ఉన్న చెట్ల వెనుకకు వెళ్లి పడిపోయింది. ఆ తర్వాత విమానం కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున నల్లటి పొగలు గాల్లోకి వ్యాపించాయి. విమానంలోని ప్రయాణికులు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని, స్థానిక కండోమినియం కాంప్లెక్స్‌లోని ఒక ఇల్లు మాత్రమే దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. నివాసితులు ఎవరూ గాయపడలేదని విన్‌హెడో సమీపంలోని వాలిన్‌హోస్‌లోని నగర అధికారులు పేర్కొన్నారు. విమానం సావో పువాలోలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతులకు ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరారు.

    పరానా నుంచి ప్రయాణం..
    బ్రెజిల్‌ లని పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి విమానం సావో పాలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానం సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉన్న విన్హెడో పట్టణం వద్దకు చేరగానే ఏటీఆర్-నిర్మిత విమానం నియంత్రణ లేకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. కాసేపటికి కూలిపోయిందని ఎయిర్‌లైన్ వోపాస్ తెలిపింది. పీఎస్-వీపీబీ రిజిస్ట్రేషన్‌ ఉన్న విమానం కూలిపోవడానికి కారణం ఏమిటనే దానిపై మరింత సమాచారం అందించలేమని విమానయాన సంస్థ తెలిపింది. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల తర్వాత సావో పాలో రాష్ట్ర అగ్నిమాపక దళం ఏడుగురు సిబ్బందిని క్రాష్ జరిగిన ప్రదేశానికి తరలిస్తున్నట్లు తెలిపింది. ఈ విమానాన్ని ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 ఏటీఆర్ 72-500 టర్బోప్రాప్‌గా జాబితా చేసింది.

    ఏడాది వ్యవధిలో మూడో ప్రమాదం..
    విమాన ప్రమాదాలు ఎక్కవగా నేపాల్‌లో జరుగుతాయి. కానీ ఈ ఏడాది బ్రెజిల్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మూడు విమాన ప్రమాదాలు బ్రెజిల్‌లోజరిగాయి. 2023, సెప్టెంబర్‌ 17న బ్రెజిలియన్ అమెజాన్ అడవుల్లో పాపులర్ టూరిస్ట్ టౌన్ ‘బార్సెలోస్’లో ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్‌ ప్రయత్నించి ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారందరూ చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇక 2024, జనవరి ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మినాస్‌ గెరైస్‌ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. బయల్దేరిన కాసేపటికే గాల్లోనే విమానం ముక్కలైంది. ఇక తాజాగా బ్రెజిల్‌లోని సావో పాలో సమీపంలో ఘోరప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది మొత్తం మరణించారు.