Afghanistan Kunar River: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దశాబ్దాల నాటి సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్తాన్‌ను నీటిదెబ్బ కొట్టింది. అవసరం ఉన్నప్పుడు ఆపి.. అవసరం లేనప్పుడు వదులుతూ వరదలు సృష్టిస్తోంది. దీంతో పాకిస్తాన్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక ఇప్పుడు ఆఫ్గానిస్తాన్ కూడా భారత్ బాటలో పయనిస్తోంది. ఆఫ్గానిస్తాన్–పాకిస్తాన్ మధ్య ఎలాంటి జల ఒప్పందాలు లేవు. దీంతో ఆఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవహించే నీటిని నియంత్రించాలని నిర్ణయించింది. తాలిబన్ నాయకత్వం కునార్ నది ప్రవాహాన్ని నియంత్రించే ప్రణాళికలు వేగవంతం చేసింది. తాలిబాన్ నాయకుడు హైబతుల్లా ఖుల్‌జాదా ఆదేశాల మేరకు, స్థానిక ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో డ్యాం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తమాషా ఏమిటంటే.. ఈ ప్రాజెక్టులో కేవలం భారత్ సాంకేతిక సలహాలు మాత్రమే ఉపయోగించవచ్చని సూచించారు. ఇతర దేశాల జోక్యాన్ని పూర్తిగా నిరోధించారు. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా మరొక దిశలో దెబ్బతీయబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
కునార్ నది పాకిస్తాన్‌కు ప్రాణాధారం
హిందూకుష్ పర్వత శ్రేణుల వద్ద నుంచి ఉద్భవించే కునార్ నది, ఆఫ్గానిస్తాన్‌లోని నంగర్‌హార్, కునార్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి, చివరగా కాబూల్ నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఇది పాకిస్తాన్ సరిహద్దు చేరి చిత్రాల్ నదిగా పేరు మార్చుకుంటుంది. తర్వాత పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రాలకు సాగు, తాగునీటి మూలంగా మారుతుంది. ఈ నదిపై ఆఫ్గాన్ డ్యాం పూర్తి అయితే, పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన వ్యవసాయ రాష్ట్రాలకు నీటి సరఫరా తీవ్రంగా తగ్గిపోతుంది. నీటి కొరతతో సాగు వ్యవస్థలు దెబ్బతినడమే కాక, పాకిస్తాన్‌లో ఆహార భద్రత కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది.
భారత్–ఆఫ్గాన్ జల సహకారం
ఆఫ్గానిస్తాన్‌కు భారత్ ఇప్పటికే జలాభివృద్ధి రంగంలో కీలక మద్దతు అందిస్తోంది.
– 2016లో సల్‌మా డ్యాం (ఇండియా–ఆఫ్గాన్ ఫ్రెండ్షిప్ డ్యాం) నిర్మాణానికి 100 మిలియన్ డాలర్లను భారత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇది 42 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో పాటు 85,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ప్రస్తుతం షాతూత్ డ్యాం పనులు కొనసాగుతున్నాయి, దీనికి 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి కేటాయించబడింది. ఈ డ్యాం ద్వారా కాబూల్ పట్టణానికి తాగునీరు, వ్యవసాయ అవసరాలు తీరుస్తుంది. ఇప్పుడు కునార్ నది ప్రాజెక్టులో భారత్ సలహాదారుడిగా పాల్గొనడం, పాకిస్తాన్‌కు డిప్లొమాటిక్ ఒత్తిడిని పెంచుతోంది.
పాకిస్తాన్‌కు రెండువైపులా వాయింపు..
భారత్ సిందూ ఒప్పందాన్ని నిలిపివేయడం, ఆఫ్గాన్ కూడా కునార్ నది ప్రవాహాన్ని నియంత్రించేందుకు సన్నద్ధం కావడంతో పాకిస్తాన్ రెండు వైపులా నీటి ఒత్తిడిలో చిక్కుకుంటోంది. ఒకవైపు భారత్ సరిహద్దు నుంచీ నీటి ప్రవాహం తగ్గుతుండగా, మరోవైపు ఆఫ్గాన్ సరిహద్దు నుంచీ నిల్వ డ్యామ్ నిర్మాణం అతడిని ఆర్థికంగా బిగించబోతుంది. తాలిబన్ ప్రభుత్వం మొదటిసారి జల వనరులను జాతీయ ఆస్తిగా పరిగణించి, వాటిని భద్రపరిచే ప్రణాళికలను సీరియస్‌గా తీసుకుంది. ఇది కేవలం పాక్‌పై ఒత్తిడికే కాదు, తమ అంతర్గత నీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి, సాగు భూముల విస్తరణకు కూడా కీలకం.
కునార్ నది ప్రాజెక్ట్ ద్వారా ఆఫ్గానిస్తాన్ తన భౌగోళిక ప్రభావాన్ని విస్తరించడమే కాకుండా, భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరిచింది. పాకిస్తాన్‌కు మాత్రం ఇది మరో జల సంక్షోభం గంట మోగించినట్లే. భారత్–ఆఫ్గాన్ జలసహకారం కొత్త సమీకరణానికి ఆరంభం కావొచ్చు. ఇది దక్షిణాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.