Russia: ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు జనాభా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకుపైగా జనాభా ఉంది. ఇందులో 35 శాతం జనాభా భారత్, చైనాలోనే ఉంది. ఇదే సమయంలో అభివృద్ధి చెందిన జపాన్, రష్యా, చైనా దక్షిణ కొరియా వంటి దేశాలు జనాభా సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో వివిధ కారణాలతో జననాల రేటు తగ్గుతోంది. ఈ నేపథ్యంలో జననాల రేటుపెంపునకు ఇప్పటికే చైనా చర్యలు చేపట్టింది. గతంలో భారీగా పెరిగిన జనాభాతో ఒకే సంతానం ఉండాలని నిబంధన విధించింది. ఇప్పుడు బిడ్డలను కనాలని ఆఫర్ ప్రకటించింది. జపాన్ కూడా బిడ్డను కన్న వారికి ఆఫర్ ప్రకటించింది. ఆ జాబితాలో తాజాగా రష్యా కూడా చేరింది.
బిడ్డనుకంటే నగదు..
రష్యా వాయవ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్ ప్రకటించారు. స్థానిక యూనివర్సిటీ, కాలేజీల్లో చదివే 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డను కంటే వారికి రూ.92 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ప్రవేశపెడుతున్న ఈ స్కీమ్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే రష్యా, దాని రీజియన్ ప్రాంతాలు జననాల రేటును పెంచడానికి పలు చర్యలు చేపట్టాయి.
కండోమ్స్, మాత్రలపై నిషేధం..
ఇటీవల ఉక్రెయిన్‌తో యుద్ధంతో రష్యాలోని పలువురు యువకులు మరణించారు. బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటారన్న భయంతో చాలా మంది దేశం వదిలి పారిపోయారు. ఈ నేపథ్యంలో గర్భనిరోధక సాధనాలైన కండోమ్స్, గర్భనిరోధక మాత్రలపై నిషేధం విధించింది. ప్రతీ రష్యా మహిళ ఎనిమిది మందికి జన్మనివ్వాలని గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ‘మన జాతి సమూహాల్లో చాలామంది నాలుగు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో పెద్ద కుటుంబాలను కలిగి ఉన్న సంప్రదాయం ఉంది. మన బామ్మలు, ముత్తాతల్లో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చారు’ అని మాస్కోలో జరిగిన ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో పుతిన్ అన్నారు.
జనాభా పెంపునకు చైనా గ్రీన్ సిగ్నల్..
జనాభాలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న దేశం చైనా. అయితే ఆ దేశంలో జనాభా వృద్ధిరేటు వేగంగా పడిపోతోంది. దీనిని కట్టడి చేసేందకు రెండేళ్ల క్రితమే చర్యలు చేపట్టింది. ఆ దేశంలో మూడో బిడ్డను కనేందుకు అనుమతి ఇచ్చింది. 1979లో ఒక జంటకు ఒకే బిడ్డ నిబంధన విధించింది. దానిని 2016లో మార్చింది. రెండో బిడ్డకు అనుమతి ఇచ్చింది. అయినా జననాల రేటు పెరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మూడో బిడ్డకు కూడా అనుమతి ఇచ్చింది. చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు. ఇదే సమయంలో చైనాలో వృద్ధులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా జనాభా పెంపునకు చర్యలు చేపట్టింది.
జపాన్ కూడా..
ఇక జపాన్‌లోనూ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గింది. దీంతో యువ జనాభా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనండి అంటూ ఆఫర్లు ప్రకటించింది. పిల్లల్ని కనే దంపతులకు ఇస్తున్న నజనానా మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచింది. గతంలో ఇది రూ..2.50 లక్షలు ఉండేది.