Brunei Sultana : జుట్టు పెరిగితే మనం ఏం చేస్తాం? వెంటనే సమీపం లో ఉన్న బార్బర్ దగ్గరకి వెళ్తాం. కటింగ్ చేయించుకున్న తర్వాత అతడు చెప్పిన డబ్బులు ఇచ్చి వస్తాం. మహా అయితే కటింగ్ కు వందో, నూట యాభయో అవుతాయి..కానీ కటింగ్ కోసం అక్షరాలా 16 ఖర్చు చేసే వారిని మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ ఏ సందర్భంలో వారి గురించి చదివారా? అయితే ఈ కథనం చదవండి. అతగాడి గురించి తెలుస్తుంది.
ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రూనై దేశంలో పర్యటించారు. నరేంద్ర మోడీకి బ్రూనై రాజు హసనల్ బోల్కియా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ దేశాల అధినేతలు ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చలు జరిపారు. హసనల్ బోల్కియా ఈ భూమ్మీద ఉన్న విలాస పురుషులలో ఒకడు. ఈ ప్రపంచంలో క్వీన్ ఎలిజబెత్ -2 తర్వాత ఎక్కువ కాలం పరిపాలకుడిగా అతడు చరిత్ర సృష్టించారు. ఇతడు పూర్తిగా విలాస పురుషుడిగా పేరుపొందాడు. పాశ్చాత్య దేశాల జీవన శైలిని అనుసరిస్తాడు. ప్రస్తుతం హసనల్ రాజ కుటుంబం వద్ద 40 బిలియన్ డాలర్ల సంపద ఉంది. బ్రూనై దేశంలో చమురు – గ్యాస్ నుంచి విపరీతమైన ఆదాయం వస్తుంది.. అవి విక్రయించగా వస్తున్న సొమ్ము హసనల్ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. హసనల్ 1946లో రాజకుటుంబంలో జన్మించాడు. ఇతడు విదేశాలలో చదువుకున్నాడు. తనకు 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పెంగ్రియన్ అనక సలేహ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బ్రిటన్ వెళ్ళిపోయాడు. రాయల్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. తన తండ్రి పదవి నుంచి విరమణ తీసుకోవడంతో.. 1968 లో రాజుగా అధికారాన్ని స్వీకరించాడు.
హెయిర్ కటింగ్ కోసం..
హసనల్ విల్లాసవంతమైన రాజుగా పేరుపొందాడు. జుట్టు పెరిగితే కటింగ్ చేసుకునేందుకు ఏకంగా తన ప్రైవేట్ జెట్ విమానంలో 7000 మైళ్ళు ప్రయాణిస్తాడు.. లండన్ వెళ్లిపోయి ది డోర్ చెస్టర్ హోటల్ లోని మే ఫెయిర్ లో బార్బర్ వద్దకు వెళ్తాడు. అక్కడ కటింగ్ చేయించుకొని ₹16.5 లక్షలు వెచ్చిస్తాడు. ఈ విషయంపై డైలీ మెయిల్ 2009లోనే ఒక పెద్ద కథనాన్ని రాసింది. హసనల్ కు పెయింటింగ్స్ అంటే విపరీతమైన ఇష్టం. పియర్రీ అగస్టే రినోయిర్ గీసిన చిత్రాన్ని అతడు 70 మిలియన్ డాలర్లకు కొన్నాడు. హసనల్ నివసించే భవనంలో 1700 గదులు ఉన్నాయి. ఇందులో 257 బాత్ రూమ్ లు ఉన్నాయి. ఐదు ఈత కొలనులు ఉన్నాయి. ఈ భవనానికి ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ అనే పేరు ఉంది. దీని పేరు మీద గిన్నిస్ రికార్డు కూడా ఉంది. 1984లో దీనిని నిర్మించారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి 1.4 బిలియన్ డాలర్లు వెచ్చించారు.
అరుదైన కార్ల కలెక్షన్
హసనల్ వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఇతడికి వందకు పైగా గ్యారేజీలు ఉన్నాయి. వీటిల్లో ఏడు వేలకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఐదు బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. ప్రపంచంలో ఎవరి వద్ద లేని కార్లు హసనల్ వద్ద ఉన్నాయి. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 600 కార్లు హసనల్ గ్యారేజీలో ఉన్నాయి. 450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లు కూడా ఇతని వద్ద ఉన్నాయి. ఫోర్ష్, లంబోర్గిని, బీఎండబ్ల్యూ, జాగ్వర్ వంటి కంపెనీలకు చెందిన అరుదైన వాహనాలు ఇతడి వద్ద ఉన్నాయి. ఇతడి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కారు కు బంగారం పూత పూసి ఉంటుంది. ఫెరారీ కంపెనీకి చెందిన 456 జీటీ వెన్సీ రకానికి చెందిన కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఏడు మాత్రమే ఉండగా.. ఒకటి హసనల్ వద్ద ఉంది.