Viral Video : తన బిడ్డను అపురూపంగా చూసుకోవడంలో.. అల్లారుముద్దుగా పెంచుకోవడంలో.. ఆకాశంలో జాబిల్లి కేసి చూపిస్తూ గోరుముద్దలు తినిపించడంలో.. ఇలా తల్లి ప్రతి సందర్భంలోనూ తన ప్రేమను అంతకుమించి అనే లాగానే బిడ్డ మీద చూపిస్తుంది. కేవలం మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా తన బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటాయి. పక్షుల నుంచి మొదలుపెడితే పులుల వరకు ప్రేమను పంచడంలో అజరామరతను ప్రదర్శిస్తాయి. అందువల్లే తల్లి పాత్రను.. తల్లి చూపించే ప్రేమను ఏ ఉపోద్ఘాతం భర్తీ చేయలేదు. ఏ ఉపమానం కూడా కొలవలేదు. అయితే అలాంటి తల్లి ముందు బిడ్డలు చనిపోతే.. చూస్తుండగానే ప్రాణాలు వదిలేస్తే ఎంత దారుణంగా ఉంటుంది.. ఆ తల్లి కష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది.. ఆ నష్టం ఎంత దారుణంగా ఉంటుంది..
కళ్ళ ముందు చనిపోయింది
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంక అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఓ పంటకాలువ పక్కన ఓ కుక్క తన రెండు పిల్లలతో ఉంటోంది. ఆ పిల్లలు కూడా కూనలు. వాటికి పాలిచ్చి.. అల్లారు ముద్దుగా చూసుకుంటున్నది. తన రెండు కూనలను.. కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది. అయితే ఆ కుక్క ఉన్నటువంటి అరవడం.. ఆర్తనాదాలు పెట్టడంతో స్థానికులకు ఎందుకో అనుమానం కలిగింది. ఏం జరిగిందో చూద్దామని అటు వెళ్లగా.. ఆ కుక్క సంతానంలో ఒక కూన చనిపోయింది. ఆ కూన నోటి వెంట నురగ కూడా కనిపించింది. అనుమానం వచ్చిన స్థానికులు అటువైపు చూడగా ఒక పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ నాగుపాము ఆ కుక్క కూనపై ముందుగా దాడి చేసింది. తల్లి కుక్క చూస్తుండగానే మింగేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ కుక్క గట్టిగా అరవడంతో.. కూనను కాటేసి దూరంగా వెళ్లిపోయింది. విష తీవ్రత అధికంగా ఉండడంతో ఆ కుక్క కూన క్షణాల్లోనే చనిపోయింది. స్థానికులు వెంటనే వర్మ అనే స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. అతడు వచ్చి ఆ నాగుపామును లాఘవంగా పట్టుకొని.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశాడు తన కళ్ళ ముందు తన బిడ్డ చనిపోవడం.. ఎంత ప్రయత్నించినా కాపాడుకోలేకపోవడం.. ఆ తల్లి కుక్క హృదయ విధారకంగా విలపిస్తోంది. అంతేకాదు మరో కూనను తన కడుపులో దాచుకొని.. చనిపోయిన ఇంకో కూనను చూస్తూ దారుణంగా ఏడ్చింది. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. అయితే కొంతమంది ఆ పామును చంపడానికి ప్రయత్నించగా.. స్నేక్ క్యాచర్ వర్మ అడ్డుకున్నాడు.
View this post on Instagram