Viral Video : ప్రభుత్వాల చెలగాటం.. ఎన్నాళ్లీ పరీక్షల పోరాటం.. కదిలిస్తున్న గ్రూప్ -1 అభ్యర్థి కన్నీటి వీడియో..

అతడు చాలా సంవత్సరాలుగా అశోక్ నగర్ వీధుల్లో.. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. 40 దాటినా పట్టువదలని విక్రమార్కుడి లాగా గ్రూప్ -1 ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి కన్నీటి పర్యంతమవుతున్నాడు. గుండెలు బరువెక్కేలా ఏడుస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 1:43 pm

Viral Video

Follow us on

Viral Video :  ఆ గ్రూప్ -1 అభ్యర్థి ఆవేదన మొత్తం జీవో :29 గురించి.. అది తెస్తున్న ఇబ్బందుల గురించి.. గత ప్రభుత్వం వైఫల్యాల నేపథ్యంలో మరికొన్ని పోస్టులు కలిపి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ -1 నోటిఫికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే ప్రిలిమ్స్ నిర్వహించింది. ఇప్పుడు మెయిన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం జీవో :29 ను తెరపైకి తేవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.. జీవో 29 కంటే ముందు జీవో 55 ప్రకారం నాటి భారత రాష్ట్ర సమితి గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు నిర్వహించేటప్పుడు సరైన విధానాలు పాటించకపోవడంతో రెండుసార్లు రద్దయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ – 1 లో మరికొన్ని పోస్టులు కలిపి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించి తీసుకొచ్చిన జీవో 29 అభ్యర్థుల్లో ఆందోళనలకు కారణమవుతోంది. పైగా మెయిన్స్ సిలబస్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి గ్రూప్స్ పరీక్షల్లో తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు తెలుగు అకాడమీతో సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.. తెలుగు అకాడమీ బుక్స్ చెల్లవని చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో..

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీవో 29వల్ల ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు.. తెలుగు అకాడమీ పుస్తకాలు చెల్లమని చెప్పడంతో మరింత ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అశోక్ నగర్ ప్రాంతంలో ఓ గ్రూప్ -1 అభ్యర్థి విలపిస్తూ చెప్పిన తన ఆవేదన గుండెలను కదిలిస్తోంది..”గత పది సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు చెల్లవని చెబుతున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలతో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కష్టపడి చదివాను. 10 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం లభించింది. ఇక నాలాంటి వాళ్ళ బతుకులు మారవని” ఆ అభ్యర్థి విలపించుకుంటూ తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో గ్రూప్ – 1 నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువకుల కలలు సౌధం కాలగర్భంలో కలిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలైంది. కాని చివరికి జీవో 29, తెలుగు అకాడమీ పుస్తకాల వ్యవహారం అభ్యర్థులకు ఇబ్బందిని కలిగిస్తోంది. ఇలా అయితే నిరుద్యోగుల కలలు నిజమయ్యేది ఎప్పుడని” సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.