Ragging video Viral :  విద్యార్థులా రాక్షసులా.. ర్యాగింగ్ పేరిట చావబాదుతారా? వైరల్ వీడియో

విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను నియంత్రించామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. విద్యార్థుల మధ్య ఐక్యత కరువై.. ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: Dharma, Updated On : July 25, 2024 12:28 pm
Follow us on

Ragging video Viral: విద్యతో భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు.. మారుతున్న కాలంలో వికృతి చేష్టలకు చిరునామాగా మారుతున్నారు. కొత్తగా విద్యాసంస్థలో చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునే విధానాన్ని విస్మరించి.. తోటి విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. దీనికే ర్యాగింగ్ అని పేరు పెట్టి తోటి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎక్కడో అక్కడ ఈ ర్యాగింగ్ భూతానికి ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే విద్యార్థుల ఆలోచన తీరులో క్రూరమైన మనస్థత్వం ప్రబలుతోంది. భవిష్యత్ తరాలకు మాయని మచ్చగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది.ర్యాగింగ్ భూతం లేదని ఒక వైపు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కానీ ఆ వికృత చేష్టలు మాత్రం కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో పల్నాడు జిల్లా నరసరావుపేట లో ఉన్న ఎస్ఎస్ఎన్ ఎడిట్ కాలేజీలో తాజాగా ఈ ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. కర్రలతో పిరుదులపై విచక్షణారహితంగా కొడుతూ పైశాచిక ఆనందం పొందుతూ కనిపించారు. ఈ ర్యాగింగ్ ఫిబ్రవరిలో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులు ఇలా వికృత చేష్టలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల్లో ఒక రకమైన భయం నెలకొంది.

* మంచి విద్యాలయంగా పేరు
నరసారావు పేట లోని శ్రీ సుబ్బరాయ, నారాయణ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్లకు కూడా గిరాకీ ఉంటుంది. ప్రధానంగా ఎన్సిసి తో పాటు ఎన్ఎస్ఎస్ విభాగాలు ఉన్నాయి. అందుకే ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కాలేజీలో చేర్పించేందుకు ఇష్టపడతారు. ఇటీవల ఓ తండ్రి తన కుమారుడిని కాలేజీలో చేర్పించాలని భావించాడు. అయితే ఆ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువగా ఉంటుందని సదరు విద్యార్థి ఈ వీడియోను తండ్రికి చూపించాడు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

* జూనియర్లపై హింస
కాలేజీలో ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడే హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జూనియర్లపై సీనియర్లు తరచూ చిత్రహింసలు పెడుతుంటారని టాక్ నడుస్తోంది. రాత్రిపూట జూనియర్లను బయట నిల్చోబెట్టి.. సీనియర్లు ఒక్కొక్కరిని గదిలోకి పిలిచారు. ఆపై వారి రెండు మోచేతులు నేలపై పెట్టించి.. కర్రలతో పిరుదులపై విపరీతంగా కొట్టారు. దెబ్బకు తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తుంటే.. సీనియర్లు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు. ఈ రాక్షస క్రీడకు వార్డెన్ సైతం సహకరిస్తుంటారని.. ప్రిన్సిపాల్ కు తెలిసిన అడ్డుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. బయటకు చెబితే హాస్టల్ నుంచి వెళ్ళగొడతారని బాధిత విద్యార్థులు సైలెంట్ గా ఉండిపోయారు.

* ఫిబ్రవరిలో ఘటన
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాజకీయరంగు పులుముకునే అవకాశం ఉంది. కానీ ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది. కాలేజీలో ర్యాగింగ్ ఈ స్థాయిలో ఉంటుందని ఓ విద్యార్థి తండ్రికి చెప్పే క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.