Viral Video : అరేయ్ నీకేమైనా తలతిక్క ఉంటే దవాఖానలో చూపించుకో.. హైవే మీద నీ రీల్స్ పిచ్చి ఏంట్రా: వీడియో వైరల్

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావాలని చాలామంది భావిస్తున్నారు. సమాజం దృష్టిని తమ వైపు కేంద్రీకరించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సోషల్ ఫోబియా వల్ల వారు చేసే పనులు సంచలనంగా మారుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 30, 2024 3:48 pm

Instagram Reels

Follow us on

Viral Video :  గతంలో మనదేశంలో టిక్ టాక్ ను నిషేధించక ముందు చాలామంది అందులో రీల్స్ చేసేవారు. అలా టిక్ టాక్ ద్వారా రీల్స్ చేసుకుంటూ చాలామంది ఫేమస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చైనాతో ఏర్పడిన విభేదాల వల్ల టిక్ టాక్ యాప్ ను నిషేధించింది. ఈ క్రమంలో ఫేస్ బుక్, ఇన్ స్టా వంటివి రీల్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో స్క్రాప్ బ్యాచ్ (క్షమించాలి. ఇలా అనక తప్పడం లేదు) మొత్తం రీల్స్ బాట పట్టింది. ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ.. ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలు కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇవి చూడ్డానికి బాగుంటే పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే సెలబ్రిటీ కావాలనే పిచ్చి వల్ల అడ్డగోలుగా రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ పిచ్చి ముదిరిపోయి చాలామంది ఇటీవల చనిపోయారు. మహారాష్ట్ర లో ఓ యువతి రీల్స్ చేస్తుండగా కొండపై జారిపడి చనిపోయింది. మరో యువతి కారు అదుపుతప్పి లోయలో పడి దుర్మరణం చెందింది. ఇంకో యువతి ఏకంగా నీటిలో మునిగి కన్ను మూసింది. ఇక గాయాల బారిన పడి ఆసుపత్రుల పాలన వారి సంగతి లెక్కలేదు. పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ..నెటిజన్లు మండిపడుతున్నప్పటికీ కొంతమంది తమ రీల్స్ పిచ్చిని వదులుకోలేకపోతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తోటి వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి ప్రాంతంలో ఓ యువకుడు తన రీల్స్ పిచ్చితో అత్యంత ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. అమేథీ ప్రాంతంలోని జాతీయ రహదారి 931 పక్కన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కాడు. ఒంటిమీద చొక్కా తీసి.. కేవలం ప్యాంట్ వేసుకొని ఫుల్ అప్స్ చేశాడు. దీనికి సంబంధించి కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం పది మీటర్లకు పైగా ఎత్తులోనే అతడు ఈ స్టంట్ లు చేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాస్తవానికి అంత పైనుంచి అతడు స్టంట్ చేయడం చూసేవాళ్ళకు ఇబ్బంది కలిగించింది. ఒకవేళ అతడి చేయి పట్టుతప్పి జారి కింద పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కిందివాళ్లు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ అతడు తన ధోరణి మార్చుకోలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో పుల్ అప్స్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. వారు సంఘటన స్థలానికి వచ్చి.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని.. స్టేషన్ లో విచారిస్తున్నారు.. అయితే ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. మెదడులో ఏదైనా సమస్య ఉంటే మంచి దవాఖానకు వెళ్లాలి. అంతేతప్ప నడిరోడ్డు మీద ఇలా రీల్స్ తో పిచ్చి పనులు చేయడం ఏంటని.. మండిపడుతున్నారు.