Ibrahimpatnam: మనసు బాధగా ఉన్నప్పుడు అమ్మ పక్కన ఉంటే బాగుంటుంది. జ్వరం వస్తే అమ్మ తోడులో సాంత్వన లభిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంగతులను అమ్మతో పంచుకుంటే ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ సంఘటనలు మాత్రమే మారుతున్నాయి. అమ్మ అనే పదం మారడం లేదు. ఆ వ్యక్తిత్వం కూడా మారడం లేదు. ఇవే కాదు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అడుగులో అమ్మ ఉంటే అదో ఆనందం. అదో ధైర్యం. అందుకే అమ్మ అన్నది గొప్పని మాట.. వెలకట్టలేని మమతల మూట.. కానీ ఈ సృష్టిలో కొంత మంది చిన్నప్పుడే మాతృ ప్రేమకు దూరమవుతారు. మరి కొంతమంది అమ్మ ఉన్నప్పటికీ ఆ ప్రేమకు నోచుకోలేక పోతారు. అలాంటి ఓ బాలుడికి కథే ఇది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం ఓ అనాధ ఆశ్రమంలో కొంతమంది పిల్లల్ని ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా ఓ బాలుడిని కుశల ప్రశ్నలు అడిగింది. ఆ తర్వాత అతడు చెప్పిన మాటలు విని ఆమె హృదయం ద్రవించిపోయింది.. అతని పేరు రాహుల్ (పేరు మార్చాం) వయసు 15 సంవత్సరాలు. అతడికి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. అప్పటికి అతడి తల్లి వయసు 28. కొద్దిరోజుల వరకు ఆ బాలుడు తన తల్లితో కలిసి అమ్మమ్మగారింటి వద్ద ఉన్నాడు. అయితే తన కూతురికి చిన్న వయసులోనే భర్త పోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. దీంతో ఆ బాలుడి బాధ్యతను తను తీసుకొని, కూతురికి వేరే పెళ్లి చేశాడు. దీంతో ఆమె కొడుకును తండ్రి వద్దే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ బాలుడికి 10 సంవత్సరాలు వచ్చేవరకు తాతయ్య వద్దే ఉన్నాడు. తల్లి ఏడాదికి ఒకసారి వచ్చి వెళ్ళేది. ఈ దశలో ఆ బాలుడి తాతయ్యకు పక్షవాతం వచ్చింది. దీంతో బాలుడిని చూసే దిక్కు లేకుండా పోయింది. ఫలితంగా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ అనాధాశ్రమంలో చేర్పించారు. ఇక అప్పట్నుంచి అతడు అక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడికి 15 సంవత్సరాల వయసు. పదవ తరగతి చదువుతున్నాడు.. ఈసారి పరీక్షల్లో ఎలాగైనా 10/10 సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించాలని భావిస్తున్నాడు..
తల్లి ప్రేమకు నోచుకోక..
తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె భర్తకు ఈ బాలుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఏడాదికి ఒకసారి మాత్రమే పుట్టింటికి పంపిస్తాడు. ఆ సమయంలోనే అనాధ ఆశ్రమం నుంచి ఈ బాలుడు తన తాతయ్య ఇంటికి వెళ్లి అమ్మను చూస్తాడు. ఎప్పుడైనా బాధనిపిస్తే అనాధ ఆశ్రమం వార్డెన్ ఫోన్ నుంచి తల్లికి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఏడాదికి ఒకసారి తల్లిని చూసేసరికి గుక్క పెట్టి ఏడుస్తాడు. తోటి పిల్లలను చూసేందుకు వారి బంధువులు వచ్చినప్పుడు బాధపడతాడు. దూరంగా వెళ్లి ఏడుస్తాడు. ఆ యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆ బాలుడు సమాధానం చెప్పాడు. కాకపోతే అతడు చెబుతున్నప్పుడల్లా గొంతులో గీర వచ్చింది.. దుఃఖాన్ని ఆపుకుంటూ అతడు మాట్లాడిన మాట గుండెను ద్రవింపజేసింది.
జాగ్రత్తగా ఉండాలి
సాధారణంగా తల్లిని కోల్పోయినప్పుడు లేదా తండ్రిని కోల్పోయినప్పుడు, ఇద్దరి ప్రేమకూ దూరమైనప్పుడు ఆ పిల్లలు పడే బాధ దారుణంగా ఉంటుంది. ఆ ప్రేమను మరెవరూ భర్తీ చేయలేరు.. ఆ పిల్లలు కూడా ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేరు. ఎందుకంటే తల్లి అనేది అచంచలమైన ప్రేమకు ప్రతిరూపం. తండ్రి నిలువెత్తు త్యాగానికి ప్రతీక. అలాంటి వారిని కోల్పోయిన తర్వాత ఆ పిల్లలు పడే మానసిక వేదన మామూలుగా ఉండదు. అందుకే అలాంటి పిల్లలకు సాధ్యమైనంతవరకు సాంత్వన కలిగించాలి. ఒంటరి అనే భావనను దూరం చేయాలి. సింగిల్ అనే పదాన్ని పక్కనపెట్టి.. మింగిల్ అనే అనుబంధాన్ని పెన వేసుకునేలా చేయాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రేమకు లొంగిపోయే జీవి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మనిషి మాత్రమే..