Viral video : డబ్బు సులభంగా సంపాదించాలి అనుకునేవారిలో కొంతమంది కిడ్నాపర్ల అవతారం ఎత్తుతుంటారు. వారు ఇతరుల పిల్లల్ని అపహరించి ఇతర ముఠాలకు అమ్ముకుంటారు. లేదా అపహరించిన పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. కానీ రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ ప్రాంతంలో జరిగిన సంఘటన ఇందుకు పూర్తి విరుద్ధం. తాను అపహరించిన ఓ చిన్నారిని కిడ్నాపర్ అత్యంత జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రేమను పంచాడు. ఆ చిన్నారి కోరినవన్నీ కొనిచ్చాడు. దీంతో అతడి నుంచి వెళ్లిపోవడానికి ఆ చిన్నారి నిరాకరించాడు.. జైపూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ఆ కిడ్నాపర్ బారి నుంచి ఆ చిన్నారిని పోలీసులు రక్షించారు.. ఈ సమయంలో అతడిని వదిలి రానంటూ ఆ చిన్నారి ఏడవడం చూసేవారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్రాంతంలో..
జైపూర్ ప్రాంతానికి చెందిన తనూజ్ చాహర్ అనే వ్యక్తి గతంలో పోలీస్ శాఖలో పనిచేశాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపడంతో సస్పెండ్ అయ్యాడు.. 14 నెలల క్రితం తనూజ్ పృథ్వి అనే ఒక చిన్నారిని అపహరించాడు. గత ఏడాది జూన్ 14న ఈ ఘటన జరిగింది. ఆ బాలుడిని అపహరించేందుకు తనూజ్ కు నలుగురు సహకరించారు. కిడ్నాప్ చేసే సమయంలో ఆ చిన్నారి వయసు 11 నెలలు మాత్రమే. అప్పటినుంచి ఆ చిన్నారి ఆలనా పాలనా తనూజ్ చూసుకున్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ చిన్నారి తనూజ్ వద్ద ఉన్నట్టు గుర్తించారు. అయితే పోలీసులు తనను గుర్తుపట్టకుండా తనూజ్ గడ్డం మీసాలు పెంచుకున్నాడు. ఒక సాధువు లాగా కాషాయ వస్త్రాలు ధరించాడు. అయినప్పటికీ పోలీసులు తనూజ్ ను పట్టుకున్నారు. ఈ సమయంలో తనూజ్ ను బదిలీ రావడానికి ఆ చిన్నారి ఇష్టపడలేదు. పైగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో తనూజ్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. అయినప్పటికీ పోలీసులు బలవంతంగా కిడ్నాపర్ నుంచి ఆ చిన్నారిని వేరు చేశారు. తల్లికి అప్పగించారు.. తల్లి చేతిలో ఉన్నప్పటికీ ఆ చిన్నారి ఏడుపు ఆపలేదు. చివరికి పోలీసులు తనూజ్ ను అరెస్ట్ చేశారు.
కంటికి రెప్పలా చూసుకున్నాడు

అపహరించిన తర్వాత ఆ చిన్నారిని తనూజ్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. బొమ్మలు కొనిచ్చాడు. కొత్త డ్రెస్సులు వేయించేవాడు. చుట్టుపక్కల వారు అడిగితే తన కొడుకు అని చెప్పేవాడు. అంతేకాదు ఆ చిన్నారి తల్లిని తన వద్ద ఉండి పోవాలని ఆ కిడ్నాపర్ కోరడం పోలీసులను నివ్వెరపరిచింది. అయితే ఇందులో ఏదైనా ప్రేమ కోణం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు