HomeవీడియోలుViral Video: బంగారం వెంట పరుగులు తీయడం కాదు.. నీరంటేనే బంగారం.. ఒక్కసారి ఈ వీడియో...

Viral Video: బంగారం వెంట పరుగులు తీయడం కాదు.. నీరంటేనే బంగారం.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..

Viral Video:  సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని లాతూర్ నీళ్ల కోసం కన్నీరు కార్చింది. కేంద్ర ప్రభుత్వం రైలు బోగిల్లో పంపిస్తే తప్ప నీటి అవసరాలు తీర్చుకోలేకపోయింది. ప్రస్తుతం దేశ ఐటీ రాజధాని బెంగళూరు నీళ్ల కోసం బాధపడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్థూలంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలలో నీటి కరువు తాండవం చేస్తోంది. ఇదే సమయంలో ఈశాన్య భారతంలో నీటి కరువు లేదు. అక్కడి ప్రజలు నీళ్ల కోసం బిందెలతో బారులు తీరడం లేదు. వాళ్ళ అవసరాలకు సరిపడా అక్కడ నీరు ఉంది. అక్కడ జనజీవనం కూడా సవ్యంగా సాగుతోంది. మనలో చాలామంది బంగారం వెంట పరుగులు తీస్తుంటారు.. దానిని కొనుగోలు చేసేందుకు ఆతృత పడుతుంటారు. కానీ తాగే నీరే బంగారమని తెలుసుకోలేకపోతున్నారు. నీటిని ఎందుకు పొదుపుగా వాడుకోవాలి? ఎందుకు సంరక్షించుకోవాలి? నీటిని సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే అంశాలపై ఓ వ్యక్తి తీసిన వీడియో ఆలోచింపచేస్తోంది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజస్థాన్ అంటేనే.. కరువు రాష్ట్రం.. పూర్తి ఎడారి ప్రాంతమైన ఆ రాష్ట్రంలో గుక్కెడు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో సగటు వర్షపాతం కూడా తక్కువే. అలాంటి ప్రాంతంలో బతకాలంటే చాలా కష్టం. ఎక్కడో ఒకచోట నీటి నిల్వలు లభ్యమవుతాయి. అక్కడే రైతులు తమ పశువులను కట్టేస్తుంటారు. విద్యుత్ సౌకర్యం కూడా తక్కువే కాబట్టి చేతి ద్వారా నీటిని తోటి వాటి దాహార్తి తీర్చుతుంటారు. కుటుంబాలకు దూరంగా.. తన పెంపుడు జంతువులతో ఆ నీటి సౌకర్యం ఉన్న దగ్గరే ఉంటారు. వాటిని పొద్దంతా మేపుకొని వచ్చి.. రాత్రిపూట పెద్దబావిలో చేతితో నీటిని తోడి వాటి దాహార్తి తీర్చుతుంటారు. ఇలా ఒంటెలను, గొర్రెలను కాపాడుకుంటారు. ఒంటె పాలు అమ్మి జీవనం సాగిస్తుంటారు. గొర్రె పొట్టేళ్లను స్థానికంగా ఉన్న సంతలో విక్రయించి ఉపాధి పొందుతుంటారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోలో రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో ఒంటెలు, జీవాలను ఓ రైతు నీటి బావి దగ్గరకు తీసుకొచ్చాడు. ఒక ఇనుప పాత్రను తాడు ద్వారా బావిలోకి వేసి ఆ నీటిని పైకి లాగాడు. అలా లాగిన నీటిని ఒక ప్రత్యేకమైన కాలువలో పోస్తాడు. ఆ నీరు నేరుగా ఆ పెంపుడు జంతువులు ఉన్న దగ్గరికి వెళుతుంది. ఆ నీటిని జీవాలు, ఒంటెలు తాగుతుంటాయి. ఆ ప్రాంతంలో ఎటు చూసినా ఇసుక మాత్రమే కనిపిస్తుంది. అలాంటి ప్రాంతంలో నీటి నిల్వ ఉందంటే మామూలు విషయం కాదు. పైగా ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కూడా ఉండదు. అందువల్లే అక్కడి రైతులు స్వయంగా బావిలో నుంచి నీటిని తోడి తమ జంతువుల దాహార్తి తీర్చుతుంటారు. తాగే నీటిని వృధా చేసేవారు.. ఇతర విలాసాల కోసం వినియోగించేవారు.. నీటిని పొదుపు చేయనివారు.. నీటి సంరక్షణ తెలియని వారు.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. నీటి విలువ తెలుస్తుంది.. బంగారం వెంట పరిగెడుతున్నాం గానీ.. ఆ నీరే బంగారమని వారికి అవగతం అవుతుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియో ఇప్పటికి 20 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 417 కే లైక్స్ సొంతం చేసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular