YS Viveka Murder Case: అధికార పార్టీ పై ఆ మీడియా ఈగ కూడా వాలనివ్వదు. ఏ ఆరోపణ వచ్చినా తక్షణమే తిప్పికొడుతుంది. కౌంటర్ రాతలతో ఎదురుదాడి చేస్తుంది. జనాన్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తుంది. నిజమా .. అబద్ధమా అని తేల్చుకోలేక జనం జుట్టు పీక్కునే పరిస్థితికి తీసుకొస్తుంది. అలాంటి మీడియా సంస్థ … ఓ సంచలనం రేపిన హత్య కేసులో మౌనం దాల్చింది. ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ వార్త రాయకుండా చూసీచూడనట్టు ఉంటోంది. ఇంతకీ ఆ హత్య కేసు ఏంటి ? ఆ మీడియా సంస్థ ఏదో స్టోరీలో తెలుసుకోండి.

వైఎస్ వివేకానందరెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు. ప్రస్తుతం సీఎం జగన్ బాబాయ్. స్వతహాగా వివేకానందరెడ్డి రాజకీయనాయకుడు. పులివెందుల ప్రజలకు తల్లో నాలుక లాంటివాడు. అంతటి శక్తిమంతమైన వ్యక్తి ఓ రోజు పొద్దున విగతజీవిలా బాత్ రూంలో పడి ఉన్నాడు. శరీరం మొత్తం గొడ్డలిపోట్లు, రక్తపు మరకలతో నిండిపోయింది. కానీ అప్పటికే సీఎం జగన్ కు చెందిన సాక్షి మీడియాలో గుండెపోటుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని గంటల నాటకీయ పరిణామాల తర్వాత గుండెపోటు .. గొడ్డలిపోటుగా మారింది.
ఇదే కేసు విషయం పై కడప ఎంపీ , జగన్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. వైఎస్ వివేకా హత్య తర్వాత పులివెందుల నుంచి ఎవరెవరికి ఫోన్లు చేశారో ఆరా తీసింది. అప్పటికే సీబీఐ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారణ చేసింది. దీని పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. హత్య తర్వాత ఎవరితో మాట్లాడిందీ .. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో చెప్పినట్టు ఆ పత్రికలు రాసుకొచ్చాయి. జగన్ అంటే పడని పత్రికలు అలా రాయడం, ఆరోపించడం కొత్తేమీ కాదు. కానీ సాక్షి పత్రిక, మీడియా ఈ అంశం పై ఏమాత్రం స్పందించలేదు.

ప్రతిపక్షాల పై ఒంటి కాలిపై లేచే సాక్షి మీడియా గ్రూపు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల పై మాత్రం స్పందించలేదు. కౌంటర్ గా వార్తలు రాయలేదు. అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల పై కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా స్పందించలేదు. సీబీఐ సమక్షంలో విచారణ జరిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఆ విషయం ఎలా తెలిసింది అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. కానీ అవినాష్ రెడ్డి, సాక్షి మీడియా మాత్రం స్పందించలేదు. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి చెప్పింది నిజమే అని ఒప్పుకున్నట్టేనా ? అన్న ప్రశ్న పుడుతోంది.
చిన్న వ్యతిరేక కథనం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వస్తే.. ఆగమేఘాల పై వైసీపీ నేతలు, మీడియా సంస్థలు స్పందిస్తాయి. కానీ సీబీఐ విచారణకు సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తల పై కనీసం స్పందించే ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రతిపక్షాలకు కొత్త అస్త్రం దొరికినట్టు అయింది. తప్పు చేశారు కాబట్టే స్పందించడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విచారణ వేగవంతంగా జరిగిత మరిన్న కొత్త పాత్రలు కేసులో బయటపడతాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ తీగ లాగితే ఎవరి డొంక కదులుతుందో వేచి చూడాలి.