
Raghu Rama Krishnam Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఈ సారి పార్టీ గుర్తును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. చట్టప్రకారం అనుసరించాల్సిన నిబంధనలను పక్కన పెట్టాశారని వాపోయారు. ఎన్నికలు నిర్వహించేలా చూస్తే.. తను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని అన్నారు.
వైసీపీ గుర్తు మీద ఎంపీగా అమలాపురం నుంచి ఆయన గెలిచిన తరువాత, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తో అభిప్రాయాల బేధాలు వచ్చిన తరువాత ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పును ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయనను అధికార పార్టీ నేతల నుంచే వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీకి రెబల్ గా మారిన ఆయన జగన్మోహనరెడ్డిపైనే సూటిగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈసారి ఆయన ఎలక్షన్ కమిషన్ కు పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు.
నిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్ష స్థానానికి ఎప్పటి నుంచో ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను ఎన్నుకన్నట్లు ప్రకటించారని అన్నారు. ఇది చట్టప్రకారం చెల్లుబాటుకాకపోవడం ఆ అంశాన్ని వెనక్కి తీసుకున్నా, ఎన్నికల విషయంలో వెనుకంజ వేస్తున్నారని చెప్పారు. అసలు పార్టీ పేరునే మార్చి పలుకుతున్నారని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయితే, వైఎస్సార్సీపీ అని అంటున్నారని .. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై గతంలో ఆయన కోర్టుకు వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు తమ లెటర్ ప్లాడ్లను మార్చుకోవాల్సి వచ్చింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని లెటర్ ప్లాడ్లను మరలా ముద్రించుకున్నారు.

ఈ సారి పార్టీ ఎన్నికల గుర్తు రద్దు చేయాలని ఈసీకి పిటీషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.. వైసీపీ నేతలు చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. గతంలో ఓసారి ప్రభుత్వమే కేసులు పెట్టి వేధించింది. దీనిపై కోర్టు ద్వారా మొట్టికాయలు వేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రఘురామ విమర్శల దాడి ఎక్కువ చేశారు. ఈ సారి పార్టీ గుర్తును రద్దు చేయాలని ఈయన వేసిన పిటీషన్ పైనైనా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.